
IPL 2025: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. విశాఖ వేదికగా లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో వికెట్ తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. లఖ్ నవూ నిర్దేశించిన 210 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ మూడు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఏ మాత్రం ఆశల్లేని స్థితిలో పెద్దగా పేరు లేని అశుతోష్ వర్మ, అనామకుడైన విప్రాజ్ నిగమ్ సంచలన బ్యాటింగ్ తో డిల్లీ క్యాపిటల్స్ కు మరపురాని విజయాన్ని అందించారు. మరోవైపు లఖ్ నవూ ఘనవిజయం ఖాయమనుకున్న మ్యాచులో చేజేతులా ఓడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్ నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఎయిడెన్ మర్ క్రమ్ త్వరగా ఔటైనా, నికోలస్ పూరన్ తో కలిసి మిచెల్ మార్ష్ విధ్వంసం చేశాడు. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. పూరన్, మార్ష్ విధ్వంసానికి 9వ ఓవర్లో స్కోర్ 100 దాటింది. 12వ ఓవర్లో ముకేశ్ కుమార్ లఖ్ నవూకు చెక్ పెట్టాడు. మార్ష్ ను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు.
అయినా ఆ తర్వాత ఓవర్లో స్టబ్స్ ను టార్గెట్ చేసుకుని పూరన్ 4 సిక్స్ లు 1 ఫోర్ సహా 28 పరుగులు చేశాడు. దీంతో 13 ఓవర్లకే స్కోర్ 161-2 కు చేరుకుంది. ఈ దశలో లఖ్ నవూ ఈజీగా 240 స్కోర్ చేసేలా కనిపించింది. కానీ తర్వాత ఓవర్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషభ్ పంత్ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగి నిరాశ పరిచాడు.
ఇక పూరన్ను స్టార్క్ వెనక్కి పంపించాడు. చివరిలో ఢిల్లీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల పరుగుల వేగం మరింత తగ్గింది. డేవిడ్ మిల్లర్ తప్పా మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. దీంతో లఖ్ నవూ 209 పరుగులకే పరిమితం అయ్యింది. స్టార్క్ 3, కుల్దీప్ 3, నిగమ్, ముకేశ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.