CSK vs GT: గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం
CSK vs GT: వరుసగా రెండో విజయం నమోదు..
CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయ ఢంగా మోగించింది. టాస్ ఓడిన చెన్నై జట్టు అద్భుతమైన ఆటతీరుతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర పటిష్టమైన పునాదివేశారు. జట్టుస్కోరు 62 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర 46 పరుగుల వ్యక్తిగత స్కోరుతో తొలివికెట్ గా వెనుదిగిగాడు. ఆతర్వాత ఆజింక్యా రెహానేతో కలిసి కెప్టన్ రుతురాజ్ గైగ్వాడ్ ఇన్నింగ్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 12 పరుగులతో రెహానే వెనుదిరిగాడు. ఆతర్వాత 46 పరుగుల వ్యక్తిగత స్కోరుతో గైక్వాడ్ పెవీలియన్ బాట పట్టాడు. చెన్నై బ్యాట్స్ మెన్ శివందుబే... సిక్సర్లతో చెలరేగి జట్టుస్కోరును పరుగులు పెట్టించాడు. 23 బంతులు ఎదుర్కొన్న శివందుబే రెండు ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరగులు నమోదు చేశాడు. సమీర్ రిజ్వీ 14 పరుగులు, రవీంద్ర జడేజా 7 పరుగులతో సరిపెట్టుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయిన చెన్నై జట్టు 206 పరుగులు చేసింది.
207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా... విజయతీరం చేరలేకపోయింది. కెప్టన్ శుభమన్ గిల్ తో ఆరంభమైన వికెట్ల పతనంతో ఏదశలోనూ మెరుగైన స్కోరు సాధించలేకపోయింది. సాయిసుదర్శన్ 37 పరగులతో గుజరాత్ జట్టులో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. వ్రుద్దిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ చెరో 21 పరుగులు నమోదు చేశారు. మిగతావారెవ్వరూ అంతగా పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమైన గుజరాత్ 63 పరగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నై జట్టులో 51 పరుగుల అత్యధిక స్కోరుతో శివందుబే టాప్ స్కోరర్ గా నిలిచి, జట్టువిజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.