IPL 2020 : ఆ స్పాన్సర్‌షిప్‌పై గందరగోళం.. రద్దు చేసుకుంటేనే కొలిక్కి

గాల్వన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య కారణంగా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.

Update: 2020-06-22 12:31 GMT

గాల్వన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య కారణంగా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారత్ లో చైనా ఉత్పత్తులని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎటూ తేల్చుకోలేకపోతోంది. గత రెండేళ్లుగా చైనాకి చెందిన వివో కంపెనీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. దాంతో వివోతో బీసీసీఐ ఆ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.

వివో బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుంది. వివో ఏటా 440 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఈ ఏడాది కరోనా కారణంగా మార్చి లో జరగాల్సిన ఐపీఎల్ తాత్కాలికంగా రద్దు అయింది. కాగా.. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ క్రమంలో స్పాన్సర్‌షిప్‌ మార్పు కష్టమని బీసీసీఐ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చైనాపై సీరియస్‌గా ఉండటం, కొన్ని ప్రాజెక్ట్‌లను రద్దు చేసుకుంటూ ఉండటంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది.

ఐపీఎల్ ఈ సీజన్‌ నిర్వహణ, షెడ్యూల్‌పై గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఈ వారంలో జరగాల్సి ఉంది. కానీ.. టోర్నీ టైటిల్ స్ఫాన్సర్‌‌షిప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో మీటింగ్‌ తాత్కాలికంగా వాయిదాపడినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News