కూనలని తీసి పారేస్తే.. పులుల్లా ముందుకు ఉరుకుతారు. అండర్ డాగ్.. అని అనుకున్న వారే కొంప ముంచేస్తారు. ఇది చాలా సార్లు రుజువైంది. ఇపుడు మరోసారి. మూడు రోజులుగా చప్పగా సాగుతున్న ప్రపంచ కప్ లో తొలిసారి ఒక మంచి మ్యాచ్ ని చూపించారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. టాస్ ఓడిపోయినా.. బ్యాటింగ్ చేయడానికి తొలుత ఇబ్బందులు పడ్డా.. మెల్లగా ఒక్కో ఇటుకనే పేర్చినట్టు .. ఒక్కో పరుగూ చేస్తూ.. అందిన బంతిని వదలకుండా బౌండరీ దాటిస్తూ బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ దక్షిణాఫ్రికా బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. ఆనక బౌలింగ్ లో ఒక్కో వికేట్టూ పడగొడుతూ.. పరుగుల ప్రవాహాన్ని నిలువరిస్తూ నిదానంగా.. అవతలి పక్షాన్ని గుక్కతిప్పుకోకుండా చేసి విజయాన్ని నమోదు చేశారు.
ప్రపంచ కప్ పోటీల్లో తొలి సంచలనం నమోదైంది. బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టును ఓడించి టోర్నీలో శుబారంభాన్ని అంతకు మించిన ఆత్మా విశ్వాశాన్ని మూటగట్టుకుంది. విజయాన్ని సాధించడానికి 331 పరుగులు చేయాల్సి ఉండగా.. దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులు మాత్రమె చేయగలిగింది. నిదానంగా బ్యాటింగ్ మొదలు పెట్టిన సఫారీలు దీంతో పది ఓవర్లకు ఆ జట్టు వికెట్ నష్టానికి 51 పరుగులు చేసి నిలకడ మీద కనిపించారు. ఈ దశలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫా డు ప్లెసిస్ క్రీజులోకి వచ్చి మెరుపులు మెరిపించాడు. అతడికి మార్‌క్రమ్ సహకారం అందించడం తో జట్టు స్కోరు పరుగులు పెడుతున్నట్టు కనిపించింది. ఇన్నింగ్స్ 20 వ ఓవర్లో 56 బంతుల్లో 45 పరుగులు చేసి జోరుమీదున్న మర్కరమ్‌ను షకీబ్ పెవిలియన్‌కు పంపాడు. తరువాత మళ్లి దక్షిణాఫ్రికా స్కోరు బోర్డ్ మందగించింది. ఈసారి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫా డు ప్లెసిస్ అర్ధశతకం సాధించాడు. దీంతో 25 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఫర్వాలేదనుకుంటున్న తరుణంలో అర్ధశతకంతో దూసుకుపోతున్న ఫా డు ప్లెసిస్(62; 53 బంతుల్లో ) మెహిది హాసన్ వేసిన 27వ ఓవర్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ఇకద్నుంచి స్కోరు బోర్డ్ ముందుకు కదలడానికి చాలా కష్టపడింది.. డేవిడ్ మిల్లర్, వాండర్ డుస్సేన్ లు బ్యాట్లు ఝులిపించినా ఫలితం లేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడిపోవడంతో ఒత్తిడికి గురైన సఫారీలు విజయం ముందు బోర్లా పడ్డారు. దీంతో 21 పరుగులతో బంగ్లాదేశ్ జయకేతనం ఎగురవేసింది.
అంతకు ముందు బంగ్లాదేశ్ బ్యాటింగ్లో తమిమ్ ఇక్బాల్(16; 29 బంతుల్లో 2x4), సౌమ్యసర్కార్(42; 30 బంతుల్లో 9x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన షకిబ్ అల్ హసన్(75; 84 బంతుల్లో 8x4, 1x6), ముష్ఫికర్ రహీమ్(78; 80 బంతుల్లో 8x4) బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరుకు పునాదులు వేశారు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గత ప్రపంచకప్‌లో బంగ్లా 141 పరుగుల అత్యధిక భాగస్వామ్యమే ఉండేది. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును చెరిపేసింది. షకిబ్, ముష్ఫికర్ ఔటయ్యాక మహ్మద్ మిథున్(21; 21 బంతుల్లో 2x4,1x6) ఫర్వాలేదనిపించాడు. చివర్లో మహ్మదుల్లా(46; 33 బంతుల్లో 3x4, 1x6), మొసాడెక్ హుసేన్ (26; 20 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడి 48 ఓవర్లలోనే స్కోరును 300 పరుగులు దాటించారు. ఆఖరి రెండు ఓవర్‌లలో 28 పరుగులు రాబట్టడంతో దక్షిణాఫ్రికా ముందు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, ఫెలుక్వాయో, క్రిస్ మోరిస్ తలో రెండు వికెట్లు తీశారు.