3TC Solidarity Cup 2020: డివిలియర్స్ సిక్సర్ల మోత : 24 బంతుల్లో 61 పరుగులు
3TC Solidarity Cup 2020: క్రికెట్ లో సిక్సర్ల మోత చూసి చాలా రోజులైంది. అయితే ఆ కొరతను ఏబీ డివిలియర్స్ తీర్చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ల మధ్య కొత్త తరహాలో జరిగిన 3టీసీ క్రికెట్ సాలిడారిటీ కప్ లో డివిలియర్స్ రెచ్చిపోయాడు
3TC Solidarity Cup 2020: క్రికెట్ లో సిక్సర్ల మోత చూసి చాలా రోజులైంది. అయితే ఆ కొరతను ఏబీ డివిలియర్స్ తీర్చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ల మధ్య కొత్త తరహాలో జరిగిన 3టీసీ క్రికెట్ సాలిడారిటీ కప్ లో డివిలియర్స్ రెచ్చిపోయాడు. ఏకంగా 24 బంతుల్లో 61 పరుగులు చేసి ఒంటిచేత్తో తానూ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈగల్స్ టీమ్ గోల్డ్ మెడల్ కి గ్రాండ్ విక్టరీని అందించాడు.
'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమానికి మద్దతుగా దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం మొత్తం మూడు జట్లతో ఈ టోర్నీని నిర్వహిస్తుంది. నల్లజాతి వారికి అండగా నిలిచేందుకు విరాళాలు సేకరించడమే ఈ టోర్నీ లక్ష్యం .. అయితే ఇందులో జట్టుకి మొత్తం ఎనమిది మంది మాత్రమే సభ్యులు ఉంటారు. 6 ఓవర్ల చొప్పున ఒక్కో జట్టు రెండుసార్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అత్యధిక స్కోర్ చేసిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు.
అయితే శనివారం జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ మొదటిసారి 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక రెండోసారి బ్యాటింగ్ కి దిగినప్పుడు మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. మరో మూడు బంతుల్లో 11 పరుగులు చేసి 61 పరుగులు చేసి అదరగొట్టాడు. మొత్తం ఈగల్స్ టీం 12 ఓవర్లలో నాలుగు వికెట్లకు 160 పరుగులు చేసింది.
ఇక ఈ మొత్తం టోర్నీలో ఈగల్స్ టీమ్‌కి బంగారు పతకం, కైట్స్ టీమ్‌కి రజతం, కింగ్‌ఫిషర్ టీమ్‌కి కాంస్య పతకం లభించాయి. అయితే కరోనా వలన ఈ మ్యాచ్ ని వీక్షించడానికి మైదానంలో ఒక్క ప్రేక్షకుడు లేకపోవడం గమనార్హం!