తొలి సెల్ఫీ ఎవరు తీసుకున్నారు? సెల్ఫీలపై మోజు ఎందుకు?

సెల్ఫీలు తీసుకునే సమయంలో ఏమరుపాటుగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇటీవల కాలంలో సెల్ఫీలు తీసుకుంటూ పలువురు మృత్యువాత పడుతున్నారు.

Update: 2024-08-05 11:50 GMT

తొలి సెల్ఫీ ఎవరు తీసుకున్నారు?: సెల్ఫీలపై మోజు ఎందుకు?

నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి మహారాష్ట్ర బోరాన్ ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు 60 అడుగుల లోయలో జారిపడింది. అక్కడే ఉన్న పర్యాటకుల సహాయంతో పోలీసులు ఆమెను కాపాడారు. సెల్ఫీల కోసం ప్రమాదకర ఫీట్లు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవలకాలంలో ఎక్కువయ్యాయి.


 ప్రాణాలమీదికి తెస్తున్న సెల్ఫీ మోజు

సెల్ఫీలు తీసుకునే సమయంలో ఏమరుపాటుగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇటీవల కాలంలో సెల్ఫీలు తీసుకుంటూ పలువురు మృత్యువాత పడుతున్నారు. 2023 జూన్ 23న తెలంగాణలోని హన్మకొండ జిల్లా నడికూడ కంఠత్మకూర్ లో కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ అనే యువకుడు కంఠాత్మకూర్ వాగులో పడి మరణించారు.

కర్నాటకకు చెందిన 40 మంది విద్యార్ధినులు 2022 నవంబర్ 26న మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలోని కిట్వాడ్ వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ఐదుగురు యువతులు జలపాతంలో పడ్డారు. ఇందులో నలుగురు చనిపోయారు. ఓ యువతిని కాపాడారు.

పశ్చిమ బెంగాల్ లోని హావ్ డా జిల్లాలో 2022 నవంబర్ 8న రైల్వేట్రాక్ పై సెల్ఫీ తీసుకుంటున్న షరీఫ్ అలీ ముల్లిక్, షరిపుల్ ముల్లిక్ మరణించారు. కుల్గాచియా-బగ్నాన్ రైల్వేస్టేషన్ల మధ్య సెల్ఫీ తీసుకొంటున్న సమయంలో రైలు ఢీకొని చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా అనేక ఘటనలను ఉదహరించవచ్చు.


 సెల్ఫీలతో చనిపోయినవారు ఇండియాలోనే ఎక్కువ

సెల్ఫీల మోజులో పడి చనిపోయిన వారి సంఖ్య ఇండియాలోనే ఎక్కువగా ఉందని ఓ రిపోర్ట్ బయటపెట్టింది. కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ, దిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెల్ఫీల మరణాలపై అధ్యయనం చేసింది. 2014 నుంచి 2016 సెప్టెంబర్ వరకు సెల్ఫీ మోజులో పడి 127 మంది మరణించారని ఈ రిపోర్ట్ తెలిపింది. అయితే ఇందులో ఇండియాలోనే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్టుగా ఈ నివేదిక తెలిపింది.


 సెల్ఫీలపై క్రేజ్ ఎందుకు వచ్చింది?

సెల్ఫీలంటే యువతే కాదు అన్ని వయస్సుల వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెల్ఫీలకు మరింత క్రేజ్ వచ్చింది. లైక్ లు, కామెంట్స్ , ఫాలోవర్ల కోసం సెల్ఫీలు తీసుకొనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియాలో జనాదరణ పొందాలని కోరుకొనేవారిలో కొందరు ప్రమాదకర ఫీట్స్ చేస్తున్నారు. ప్రధానంగా స్నేహితులు, కుటుంబసభ్యులు, అనుచరులను ఎంగేజ్ చేయడం కోసం సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం, గుర్తింపు కోసం, పర్యావరణ మెరుగుదల, సామాజిక పోటీ, సబ్జెక్టివ్ కన్ఫర్మిటీ కోసం సెల్ఫీల కోసం పోటీపడుతున్నారని యాన్ ఎక్స్ ప్లోరేటరీ స్టడీ ఆఫ్ సెల్ఫిటిస్ అండ్ ది డెవలప్ మెంట్ ఆఫ్ ది సెల్ఫిటిష్ బిహేవియర్ స్కేల్ అధ్యయనం చెబుతోంది.


 సెల్ఫీల కోసం ఏడు నిమిషాల టైమ్

సెల్ఫీ కోసం కనీసం ఏడు నిమిషాల పాటు సమయం కేటాయిస్తున్నారని సోషల్ సైలకాజికల్ అండ్ పర్సనాలిటీ సైన్స్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా కనీసం 1 మిలియన్ల సెల్ఫీలు తీసుకుంటున్నారని ఓ సర్వే వెల్లడించింది. జీవితకాలంలో ఒక్కరు కనీసం 2,570 సెల్ఫీలు తీసుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది.

సెల్ఫీల్లో మహిళలే టాప్

సెల్ఫీలు తీసుకోవడంలో పురుషులతో పోలిస్తే మహిళలే అగ్రస్థానంలో ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది. సగటున వారానికి నాలుగు కంటే ఎక్కువ సెల్ఫీలను మహిళలు తీసుకుంటారు. పురుషులు కనీసంగా రెండు సెల్ఫీలు తీసుకుంటారని ఆ అధ్యయనం తెలిపింది. అయతే 40 ఏళ్లు దాటిన తర్వాత మహిళల కంటే పురుషులు సెల్ఫీలు తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

తొలి సెల్ఫీ ఎప్పుడు తీసుకున్నారు?

రాబెర్ట్ కార్నెలియస్ దాదాపు 200 ఏళ్ల క్రితం ప్రపంచంలో తొలి సెల్ఫీని తీసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఫిలడెల్పియా వ్యవస్థాపకులు రాబర్ట్ కార్నెలియస్ అక్టోబర్ 1839 లో సెల్ఫీ ఫోటో తీసుకున్నారు. భారతదేశపు మొదటి స్వీయ ఫోటోగ్రాఫ్ 100 ఏళ్ల క్రితం త్రిపుర మహారాజా బీర్ చంద్రమాణిక్య రాజ దంపతులు తీసుకున్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. 1998 ఫిబ్రవరి జపాన్ లో విడుదలైన గేమ్ బాయ్ కెమెరా బహుశా హ్యాండ్ హెల్డ్ పరికరంలో మొదటి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాగా చెబుతున్నారు.

సోషల్ మీడియాలో పబ్లిసిటీని పెంచుకొనేందుకుగాను సెల్ఫీలను ఎక్కువగా వాడుకుంటున్నారు. వెరైటీగా సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదాలకు గురౌతున్నారు. సెల్ఫీలు తీసుకొనే పేరుతో ప్రమాదకరమైన ఫీట్లు ప్రాణాల మీదికి తెచ్చిపెడుతున్నాయి. సెల్ఫీలు తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags:    

Similar News