రేవ్ పార్టీ అంటే ఏంటి?
బెంగుళూరు రేవ్ పార్టీ హైద్రాబాద్ లో కలకలం రేపింది.
బెంగుళూరు రేవ్ పార్టీ హైద్రాబాద్ లో కలకలం రేపింది. ఈ పార్టీలో పట్టుబడిన తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ ఎవరనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, కొందరు సినీ, టీవీ రంగానికి చెందిన ఆర్టిస్టులు రేవ్ పార్టీకి వెళ్లలేదని ప్రకటించారు.ఈ పార్టీలో తాము పాల్గొన్నట్టుగా సాగిన ప్రచారంలో వాస్తవం లేదంటూ కొందరు వీడియోలూ కూడా రిలీజ్ చేశారు.
చాలా కాలం దిల్లీ, ముంబై, కోల్ కత్తా వంటి నగరాలకు పరిమితమైన రేవ్ పార్టీలు హైద్రాబాద్ కూ కూడా నాలుగైదేళ్ళ కిందటే వచ్చేశాయి. కొన్ని సార్లు పోలీసులు రైడ్ చేయడం, కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. నగర శివార్లలోని ఫామ్ హౌస్ లే రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి.
నెల క్రితం హైద్రాబాద్ బేగంపేటలోని ఓ క్లబ్ పై పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళారు. రేవ్ పార్టీలో పాల్గొన్నారనే ఆరోపణలతో 77మందిపై కేసు నమోదు చేశారు.
ఇక.. ఎనిమిది నెలల క్రితం మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నదని తెలిసిన పోలీసులు ఆక్కడ కూడా రైడ్ చేశారు. ఆ అపార్ట్ మెంట్ లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు.
రేవ్ పార్టీ అంటే ఏంటి?
రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్‌తో ఈ పార్టీలలో యువతీ యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఫుడ్,కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్ డి... ఒక్కటేమిటి యువత అన్నీ మరిచి చిందులు వేయడానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అయితే, రేవ్ పార్టీకి పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. కొత్తవారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. కొత్తవారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు.
60వ దశకంలో యూరోపియన్ దేశాల్లో మద్యం కోసం పార్టీలు నిర్వహించేవారు.80వ దశకానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. 90వ దశకంలో ఈ పార్టీల స్వరూపం బాగా మారింది. డ్రగ్స్ వాడకం మాములైపోయింది. అంతేకాదు, సెక్స్ కాక్ టెయిల్స్ కూడా రేవ్ పార్టీలలో కామన్ అంటారు. ఈ పార్టీలను 24 గంటల నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.
ఈ పార్టీలు మొదట గోవాలో ప్రారంభమయ్యాయి. అక్కడ హిప్పీలు ఈ పార్టీలు ప్రారంభించారు. వీటి నిర్వాహకులు గోప్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే, సెలబ్రిటీలు రేవ్ పార్టీలపై ఎక్కువగా మొగ్గుచూపుతారు. అయినా సరే, అవి ఎలాగోలా బయటపడుతుంటాయి. పోలీసుల కంట పడుతుంటాయి. లేటెస్ట్ గా బెంగళూరు రేవ్ పార్టీ అందుకొక ఉదాహరణ.