Ugadi 2021: జగతికి కొత్త ఆశలను మోసుకొచ్చే పండుగే ఉగాది

Ugadi 2021: కాలం అపరిమితమైంది. ఆ అపరిమితమైన కాలంలో పరిమితమైనది మానవ జీవితం. అందులో మంచి చెడులు, సుఖదుఃఖాలు రెండూ ఉంటాయి.

Update: 2021-04-12 18:45 GMT

Ugadi 2021: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు, పంచాంగాలతో సందడి

Ugadi 2021: కాలం అపరిమితమైంది. ఆ అపరిమితమైన కాలంలో పరిమితమైనది మానవ జీవితం. అందులో మంచి చెడులు, సుఖదుఃఖాలు రెండూ ఉంటాయి. అంతేనా భావావేశాలుంటాయి., లోటుపాట్లూ కనిపిస్తాయ్‌. అందుకే మానవ జీవితాన్ని షడ్రుచుల సమ్మేళనంతో పోలుస్తాం. అలాంటి పరిమితమైన మానవ జీవితానికీ, ప్రకృతికీ విడదీయలేని విడదీయరాని సంబంధం ఉంది. అది మన పండుగలలో, ఉత్సవాలలో, సంప్రదాయాలలో, ఆచారాలలోనూ ఉంటుంది. అలా ప్రకృతిలోంచి చేర్చిన షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. తెలుగు సంవత్సరాది. ఉగాది పండగతోనే సృష్టి ఆరంభమైందంటారు. నూతన శకం పురుడు పోసుకుందని చెబుతారు. యుగారంభానికి పునాది వేసింది కూడా ఉగాదే. అందుకే ఉగాదిని కాలానికి సంబంధించిన పండుగ అని చెప్పుకుంటాం.

సంవత్సరాన్ని ఆరు రుతువులు, పన్నెండు నెలలను విభజిస్తే, ఏడాదిలో వచ్చే తొలి రుతువే వసంత రుతువు. తొలి మాసం చైత్రం. వసంతం ఆగమనవేళ కోకిలలు ప్రకృతిని చూసి పరవశిస్తూ గానాలాపన చేస్తుంటాయి. కొత్త చిగుళ్ళతో చెట్లు కళకళలాడుతుంటాయి. పిందెలతో, లేలేత చిగుళ్ళతో ఉన్న చెట్లు పాతను తరిమేసి కొత్తను ఆహ్వానించాలని సంకేతం ఇస్తున్నట్టుగా ఉంటాయి. పూలూ వికసిస్తాయి. జీవితంలోని మధురమైన ఆనంద సుగంధాలను ఆస్వాదంచాలని చెబుతాయి. ఇవన్నీ కూడా కొత్త సంవత్సరానికి, కొత్త జీవితానికి స్వాగతం పలకమంటూ, ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ నింపుతాయి. కొత్త ఆశలతో, ఆనందాలతో తెలుగు సంవత్సరమంతా ఆనందనిలయంగా మారాలంటూ దారి చూపుతాయి.

వసంత రుతువు ఆగమనానికి సంకేతం. నవ వసంతానికి నాందీవచనం. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేసే శుభదినం. కోయిలలు కుహు... కుహు రాగాలు పాడుతూ హాయిగొలిపే సుదినం. అదే ఉగాది. సృష్టికి ఆది. కాలచక్రంగా, ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజే ఉగాది. ఇది కాలానికి సంబంధించిన పండుగ. సర్వ మానవాళికి కన్నులపండగ. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు చైత్ర శుధ్ధ పాఢ్యమి కావడంతో ఏటా ఆ పర్వదినాన మనం ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చిరు మామిళ్ల వగరు, వేప పువ్వుల చేదు, కొత్త బెల్లం తీపి, చింతపండు పులువు, మిరపకాయల ఘాటు, ఉప్పు ఇలాంటి షడ్రుచుల సంగమమే ఉగాది పచ్చడి.

ఉగాది పచ్చడిలాగే మన జీవితమూ షడ్రుచుల సమ్మేళనమే. కాసిన్ని ఆనందాలు, మరికాసిన్ని బాధలు, ఇంకొన్ని సంతోషాలు, అప్పుడప్పుడూ నిరాశా నిస్పృహలు. వీటన్నింటి కలయికే జీవితమనే సారాన్ని ఉగాది పచ్చడి మనకందిస్తుంది. ఈ ఉగాది పర్వదినాన ఏ పనులు ప్రారంభించినా అవి నిర్విఘ్నంగా జరిగిపోతాయని పెద్దలు చెపుతూ ఉంటారు. అందుకే ఉగాది నాడు ఉదయమే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి భక్తితో పూజలు చేసి పంచాంగ శ్రవణం వింటారు.

ఇదంతా ప్రపంచమంతా ఆనందంగా ఉంటేనే సాధ్యం. ఎవరు పనుల్లో వాళ్లు ఉంటేనే సుసాధ్యం. కానీ ఇప్పుడంతా ఆపత్కాలం. ప్రపంచాన్నంత కరోనా అనే మహమ్మారి కాటేస్తున్న దుర్భర ఘడియలు. పోయిన వికారి నామ సంవత్సరంలో ఒక ప్రాంతం కాదు ఒక రాష్ట్రం కాదు ఒక దేశం కాదు యావత్‌ విశ్వమంతా వికారి సృష్టించిన వికారాలు ఎన్నె... ఎన్నెన్నో. మానవ జీవితానికి పాఠం నేర్పింది. కేవలం కష్టసుఖాలే కాదు, అన్నివిధాలైన అనుభవాలూ, అనుభూతులను మిగిల్చింది. వాటిని సమ భావనతో స్వీకరించడం అవసరమని చాటిచెప్పింది. మన జీవనయానంలో కష్టసుఖాలు, కలిమిలేములు, సంతోష సంతాపాలు అన్నిటినీ స్వీకరించాలని చెబుతూ శార్వరి నామ సంవత్సరం కాలగతిలో కలిసిపోయింది.

ఏమైనా కోకిలమ్మలు గొంతులు సవరించుకునే వేళ చిరుమామిళ్లు పరిపక్వతను సంతరించుకొనే సమయాన నవ వసంతం ఆనంద నర్తనం చేస్తూ జగతికి కొత్త ఆశలను మోసుకొచ్చే పండుగే ఉగాది. ఈ నూతన సంవత్సర కాంతుల్లో మోడువారిన జీవితాలెన్నో చిగురించాలని పాత గాయాలను మాన్పే లేపనంగా శార్వరీ నామ సంవత్సరం సర్వ మానవాళిపై కరుణ కురిపించాలని కోరుకుంటోంది హెచ్‌ఎంటీవీ. ఈ యుగాది నవ్యోదయాన కోటిఆశలతో సకల జగత్తు నవలోకంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెబుతోంది హెచ్‌ఎంటీవీ. 

Tags:    

Similar News