NTR Jayanti: ఎన్టీఆర్ తెలుగు వారి గుండె చప్పుడు.. చరిత్రలో నిలిచిపోయిన ఎన్టీఆర్ పథకాలు
NTR Jayanti: తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ తరతరాలుగా గుర్తిండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం.
NTR Jayanti: తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ తరతరాలుగా గుర్తిండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఎన్టీవోడి గర్జన నుంచి పుట్టిన వేడిగాలి దావానలంలా వ్యాపించి, తెలుగు వారి వాడి, వేడి, పౌరుష ప్రతాపాల ప్రభావాన్ని విశ్వవ్యాపితం చేసింది. అతడే ఒక సైన్యం, అతడే ఒక ప్రేరణ, అతడి మాటే వేదం, ఆయన పిలుపే ప్రభంజనం, అన్ని యుద్ధాలు తానే చేశారు. అన్ని ప్రయాణాలు తానే సాగించారు.. అన్ని తానై ముందుకు నడిచి అందరిని తన వెంట నడిపారు, ఆయన మాట శిరోధార్యంగా మలిచారు ఎన్టీఆర్. అలాంటి మహానుభావుడి 101వ జయంతి సందర్భంగా తెలుగు నేలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కళ కళ కోసం కాదు.. సమాజ శ్రేయస్సు కోసం అని నినదించడమే కాక వృత్తిజీవితంలో కూడా ఆచరించి చూపెట్టిన మొట్టమొదటి నటుడు ఎన్టీఆర్. ఆయనకు ముందు పృథ్విరాజ్ కపూర్, బళ్ళారి రాఘవ వంటి వారు ఆనాటి స్వాతంత్ర ఉద్యమ కాలంలో కొన్ని సాంఘిక కార్యక్రమాలలో పాల్గొన్నా... ఆ తర్వాత కాలంలో సమాజ హితంలో మమేకమై సంఘంలో సినిమా వారికి గౌరవస్థానం కల్పించి వారి స్థాయిని పెంచిన తొలి నటుడు మాత్రం ఎన్టీఆరే. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని తలచి సంక్షేమ రాజ్యం సృష్టించి సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారు.
సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధ్రువతారగా వెలుగొంది, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారు. 6 దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎదురులేని రారాజుగా వెలుగొందారు. అందమైన రాముడిగా, కృష్ణుడిగానే కాదు. ఠీవీ, రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు పోషించి ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జీవం పోశారు. అతని శ్వాస, ధ్యాస, ఘోష తెలుగు. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు జ్యోతికి జీవం పోసిన ప్రధాత. ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. అక్షర సేధ్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు.
ఎన్టీఆర్ కంటే ముందు కొందరు నటులు రాజకీయాల్లో అడుగుపెట్టి విజయాలు సాధించారు. వారందరూ ఏదో ఒక పార్టీలో చేరి, తరువాత పాలిటిక్స్‌లో రాణించారు. ప్రజల మనిషిని వేరే పార్టీలో చేరడమా? అంటూ ఎన్టీఆర్ సొంతంగా తెలుగుదేశం పార్టీని నెలకొల్పి రాజకీయప్రవేశం చేశారు. 1982 మార్చి 29న తాను నెలకొల్పిన తెలుగుదేశం పార్టీని కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలో విజయపథంలో పయనింపచేసి ప్రపంచంలోనే చెరిగిపోని తరగిపోని చరిత్ర లిఖించారు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో రాజకీయాలలో సంక్షేమాలకు పెద్ద పీట వేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు.
ఎన్టీఆర్ పాలనలో సాగిన రాజకీయ సంస్కరణలు సైతం మరపురానివి. వాటిని ఈ నాటికీ ఎందరో రాజకీయనాయకులు అనుసరిస్తూనే ఉండడం విశేషం. భారత రాజకీయాల్లో మహాత్మగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇక సంఘసంస్కర్తలుగా వెలుగుతున్న శంకరాచార్య, వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వారు ప్రజలను సంస్కరించారు. వారి బాటలోనే ఎన్టీఆర్ పయనిస్తూ పలు సామాజిక, రాజకీయ సంస్కరణలకు రూపశిల్పిగా నిలిచారు. కులాలు, మతాలు, కూలిన విధానాలతో కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే ఎన్టీఆర్ ఆశయం.
నాటి ఢిల్లీ పెద్దలు ఏడాదికి నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారు. తెలుగు జాతి ఖ్యాతిని పునర్జీవింప చేయడానికి తన 60 వ ఏట రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశానికి జీవం పోసి దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చేశారు. అందుకే 9 నెలల కాలంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలపై తిరుగుబాటు చేసి తెలుగుదేశం బావుటాను ఎగురవేశారు. అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ను గద్దెదింపినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో ఆయన విజయం సాధించిన తీరు జాతీయ స్థాయిలో ఎప్పటికీ నభూతో న భవిష్యత్ అనే చెప్పాలి. నాడు ఆయన చూపిన ధైర్య సాహసాలు రాజకీయ రంగలో రారాజుగా నిలిపాయి.
రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్త్రాలు, వితంతువులకు, కూలీలకు పింఛన్ల పంపిణీ వంటి వినూత్న పథకాలకు ఆయనే ఆదిగురువు. రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చేందుకు తెలుగు గంగ, అదే నీటితో చెన్నై వాసుల దాహార్తి తీర్చడం, మహిళా విశ్వవిద్యాలయం, ప్రజా సదస్సులు, వంటి కార్యక్రమాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీల వ్యవస్థ రద్దు, ప్రధానంగా అధికార వికేంద్రీకరణ జరగాలి. ప్రజల వద్దకే పాలన రావాలి, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వ్యవస్థలు ఉండాలి, స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మండలాలకు ఆధ్యుడు ఎన్టీఆరే..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మునుపు అధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో ఉండేది. ఆ సమయంలో మిగతా కులాల వారికి రామారావు ఆశాకిరణంలాగా కనిపించారు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలవారికి పార్టీలో ఉన్నతపదవులు కల్పించారు. అన్ని వర్గాలకు నూతన యువతరానికి చెందిన సామాన్యులకు, విద్యావంతులకు, మహిళలకు కేటాయించి రాజకీయాలను సామాన్యుల చెంతకు చేర్చారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు రాజ్యాధికారం కల్పించారు. ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజా నాయకుడిలా చరిత్రలో నిలిచారు.
సరికొత్త తరాన్ని, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన ''భారత ప్రజాస్వామ్య దిక్సూచి'' ఎన్టీఆర్. జాతీయ పార్టీల నాయకులు వారి ఇలాకాలకే పరిమితమైన వేళ, ఎన్టీఆర్ తన చరిష్మాతో జాతీయ నేతగా ఎదిగారు. ఇందిరాగాంధీ హత్య నుంచి పుట్టిన సానుభూతి పవనాలను తన సమరస్ఫూర్తితో అధిగమించి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం విజయ దుందుభి మ్రోగించేలా చేశారు. రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాల్లో 35 గెలిచి పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షహోదా సాధించింది. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు అనేక సమ్మేళనాలు నిర్వహించారు. ఉప్పు నిప్పులా ఉండే రాజకీయ పక్షాలైన వామపక్షాలు, భారతీయ జనతా పార్టీల మద్ధతును ఎన్టీఆర్ కూడగట్టారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ రాజకీయాలను జనం మెచ్చేలా ప్రభావితం చేసి వాటిలో కీలక పాత్ర పోషించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.
రాజకీయ రణక్షేత్రంలో ఎన్టీఆర్ అడుగుపెట్టే నాటికి రాజకీయ శూన్యత, రాజకీయ అస్థిరత్వం రాజ్యమేలుతోంది. ‘‘స్వచ్ఛందంగా సామాన్యుడి సేవ చేయడానికి వేదిక రాజకీయ రంగం. దానిని కాస్త లాభసాటి వ్యాపార రంగంగా మార్చారు. అవినీతికి, అక్రమార్జన పరులు, నేరస్థులకు నెలవుగా మారింది. “బతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బతుకులను మార్చడానికి రాజకీయాల్లోకి రండి, ఎందుకంటే రాజకీయం ఉద్యోగం కాదు ఒక సామాజిక బాధ్యత’’ అని నినదించారు. తెలుగుజాతి యావత్తు ప్రేమగా అన్నా అని పిలుచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.
ఆయన వ్యక్తి కాదు మహా శక్తి, ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు. ఒక తరానికి మార్గదర్శకుడయ్యాడు. వందల తరాలు తన బాటలో నడిచేలా చేశారు.తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి స్పష్టమైన సిద్దాంతాలు, విధానాలు, జాతీయ దృక్పథం, ఉన్నత రాజకీయ విలువలతో ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో అవే ఆశయాల కోసం 4 దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో కుటిల రాజకీయాలను ఎదుర్కొంటూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. దేశ సమకాలికుల్లో ఎన్టీఆర్ వంటి ప్రజా నాయకుడు మరొకరులేరు, ఎన్నటికీ ఉండబోరు. ప్రజా నాయకుడిగా చరిత్రలోనే కాదు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. ఆయన కీర్తి అజరామరం. అందుకే ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగు జాతి కోరుకుంటోంది.