ప్రపంచ మహిళా వన్డే క్రికెట్లో... భారత ఓపెనర్ కమ్ మరాఠా మెరుపుతీగ 22 ఏళ్ల స్మృతి మంధానా పరుగుల హోరు, సెంచరీల జోరుతో చెలరేగిపోతోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ తీన్మార్ చాలెంజ్ సిరీస్ లో సైతం మంధానా విశ్వరూపం ప్రదర్సించింది. కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ప్రత్యర్థిజట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
భారత మహిళా క్రికెట్ అనగానే మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే కాదు...డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానా కూడా అని.. అనుకొనే రోజులు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచ మహిళా క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్మృతి మంధానా మాత్రమే. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ..2017 ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ లో మాత్రమే కాదు....న్యూజిలాండ్ తో జరుగుతున్న 2019 ఐసీసీ ఛాలెంజ్ వన్డే సిరీస్ లోనూ మంధానా మెరుపులు మెరిపిస్తోంది. వన్డే ప్రపంచకప్ లో నిలకడగా రాణించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకొన్న 22 ఏళ్ల మంధానా ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. ప్రపంచకప్ .. ఎనిమిదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో... ఆడిన మొదటి రెండురౌండ్లలోనూ... భారత్ తిరుగులేని విజయాలు సాధించడం వెనుక...యువ ఓపెనర్ స్మృతి మంధానా పాత్ర ఎంతో ఉంది.
ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్ పై స్మృతి మంధానా చెలరేగి ఆడింది. ఇంగ్లీష్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ...ఆఫ్ సైడ్...ఆన్ సైడ్ అన్నతేడా లేకుండా.. స్టయిలిష్ బ్యాటింగ్ తో బౌండ్రీల వర్షం కురిపించింది. చివరకు సెంచరీకి పది పరుగుల దూరంలో అవుటయ్యింది. 2002 తర్వాత ఇంగ్లండ్ పై భారత్ తొలివిజయం సాధించడంలో ప్రధాన పాత్ర వహించడమే కాదు...ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం అందుకొంది. ఇక...వెస్టిండీస్ తో ముగిసిన రెండోరౌండ్ పోటీలో మాత్రం స్మృతి మందానా...బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో తనజట్టును ఆదుకొంది. అజేయసెంచరీతో విజేతగా నిలిపింది. కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలసి మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో భారత్ కు 7 వికెట్ల విజయం ఖాయం చేసింది. మందానా మొత్తం 108 బాల్స్ లో ..13 బౌండ్రీలు, 2 సిక్సర్లతోపాటు... 106 పరుగులతో అజేయంగా నిలిచింది.
వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొని..వారేవ్వా అనిపించుకొంది. 2017-18 సంవత్సరానికి ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్, అత్యుత్తమ వన్డే క్రికెటర్ అవార్డులు గెలుచుకొని ...వారేవ్వా అనిపించుకొంది. అంతేకాదు...న్యూజిలాండ్ తో న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ తీన్మార్ చాలెంజ్ సిరీస్ లో సైతం...మంధానా ఆకాశమే హద్దుగా రాణిస్తోంది. నేపియర్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో మంధానా ఏకంగా105 పరుగులతో సెంచరీ సాధించి...తన శతకాల సంఖ్యను నాలుగుకు పెంచుకొంది. సౌరవ్ గంగూలీని ఎంతగానే అభిమానించే స్మృతి మందానా...ఆఫ్ సైడ్, ఆన్ సైడ్లో.... అచ్చం దాదాలానే షాట్లు కొడుతూ.....లేడీ సౌరవ్ గంగూలీ అనిపించుకొంటోంది. రానున్న కాలంలో... ప్రపంచ మహిళాక్రికెట్ కాబోయే సూపర్ స్టార్..స్మృతి మంధానా అన్నా అతిశయోక్తికాదు.