Money Hunting Challenge: వ్యూస్ కోసం రోడ్డుపై డబ్బులు పడేస్తూ వీడియో.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

Update: 2024-12-18 10:59 GMT

Money Hunting Challenge: సామాజిక మాధ్యమాల మోజులో రీల్స్ పిచ్చితో కొందరు చేస్తున్న ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన డబ్బులు పడేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టిన ఓ వ్యక్తిపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్‌కు చెందిన భానుచందర్ మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేశాడు. డబ్బుల కోసం ప్రజలు ఓఆర్ఆర్‌పైకి భారీగా వచ్చే అవకాశం ఉందని.. ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ కోసం భాను చందర్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రోడ్డుపై రూ.25 వేలు పడేశాడు. ఎవరైనా వెళ్లి తెచ్చుకోవాలని సూచించాడు. ఇలా రోడ్డు మీద పడేసిన డబ్బుల కోసం నెటిజన్లు విపరీతంగా చూస్తారని భావించిన అతను వీడియోలు చేశాడు. అయితే అతడి వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు.

మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరిట హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర చందూ డబ్బులు వెదజల్లాడు. మీ కోసం రూ.25 వేల మనీ హంటింగ్ ఛాలెంజ్ చేస్తున్నా.. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీ కోసమే.. అక్కడ డబ్బులు వేశా వెళ్లి తీసుకోండి అంటూ రీల్ చేశాడు. అతడు చేసిన పనికి ఊహించని స్పందన లభించింది. ఇప్పటికే 3.8 మిలియన్ల వ్యూస్ రాగా.. దాదాపు లక్ష కామెంట్లు వచ్చాయి. కొందరు అదంతా ఫేక్ బ్రో అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు వ్యూస్ కోసం ఏమైనా చేస్తారు అని చెబుతున్నారు. మీరు చేసే డబ్బులు అసలువి కాదు నకిలీవి అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో చూసిన చందూ షేక్స్ అనే ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 120 కిలోమీటర్లు వేగంతో వెళ్లే ఓఆర్ఆర్ వద్ద ఇలాంటి పని చేయడంతో ప్రమాదాలకు దారి తీస్తుంది. అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనర్లను ట్యాగ్ చేశాడు. స్పందించిన రాచకొండ పోలీస్ కమిషనర్.. అతడిపై కేసు నమోదు చేయాలని ఘట్‌కేసర్ పోలీసులను ఆదేశించారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News