అమ్మతనానికి చిరునామా ఎమ్మెల్యే సీతక్క!

నవమాసాలూ మోస్తేనే అమ్మ కాదు. స్త్రీ తత్వంలోనే మాతృత్వ మధురిమ వుంది. అమ్మతనానికి అధికారిక దర్పాలు ఉండవు.

Update: 2020-05-08 09:37 GMT

నవమాసాలూ మోస్తేనే అమ్మ కాదు. స్త్రీ తత్వంలోనే మాతృత్వ మధురిమ వుంది. అమ్మతనానికి అధికారిక దర్పాలు ఉండవు. కష్టంలో వున్నవారికి సహాయం చేయడానికి అందరూ అక్కగా పిలుచుకునే తమ కోసం ఆ అమ్మ మనసు చేస్తున్న కష్టానికి సలామ్ చేస్తున్నారు ఆ ప్రాంత గిరిజనంతో పాటు సకలజనులూ. ఆమె సీతక్క.. ములుగు ఎమ్మెల్యే! తన ప్రాంత ప్రజలకోసం కరోనా కష్టంలో ఆమె చేస్తున్న సేవలు అమ్మతనానికి కొత్త నిర్వచనాన్ని చెబుతున్నాయి మాతృదినోత్సవ సంబరాన సీతక్క సేవలకు అందిస్తున్న అక్షరాంజలి!

కరోనా వైరస్ కారణంగా ప్రజా జీవితం అతలా కుతలమయింది. ప్రజాప్రతినిధులు ప్రజలను ఆదుకనే ప్రయత్నం చేస్తున్నారు. దాతలు తమకు తోచిన సహాయం అందిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమాలే. కానీ వీటన్నింటికి భిన్నంగా ఓ ప్రజాప్రతినిధి తన నియోజక వర్గంలోని గడపగడపకు వెళ్తున్నారు. గూడెం ప్రజల, గిరిజన ప్రాంతాల ప్రజల కన్నీటిగాథను కళ్లారా చూస్తున్నారు. వారి ఆవేదనను మనసారా వింటున్నారు. కాళినడకన వాగులు, వంకలు దాటుకుంటూ అడవిబాట పట్టారు. నిత్యావసర వస్తవులను ఎడ్ల బండ్లలో, ట్రక్కులలో తీసుకెళ్లి తన నియోజకవర్గాల ప్రజలకు చేరవేస్తూ ప్రజాప్రతినిధి అనే పదానికి అసలైన అర్ధాన్ని ఇస్తున్నారు. ఆవిడే దనసూరి అనసూయ అలియాస్ సీతక్క.

అణగారిన వర్గాల కోసం నాడు ఎగరేసిన ఎర్ర బావుటా. అదే వర్గాల అభ్యున్నతి కోసం నేడు ఎమ్మెల్యే. లాక్‌డౌన్ వేళ కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క.. మరోసారి అడవి బాట పట్టారు. ఆదివాసీల ఆశాదీపంగా మారారు. ఒక ఎమ్మేల్యేగా ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. గిరిపుత్రుల కోసం అమ్మగా మారి స్వయంగా తానే సద్దిని మోసుకెళ్లి అడవిపుత్రుల ఆకలి తీరుస్తున్నారు. ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ఎన్నో మన్ననలు పొందుతున్నారు.

సీతక్క జీవిత చరిత్ర..

ధనసరి అనసూయ  అలియాస్ సీతక్క వరంగల్ జిల్లా, ములుగు మండలం, జగ్గన్నపేట గ్రామంలో ఓ కూలి పనులు చేసి జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. తల్లి సమ్మక్క, తండ్రి సమ్మయ్యలకు అనసూయ ( సీతక్క) రెండో సంతానం. సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వం వసతి గృహంలో ఉంటూ పదోతరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసారు.

సీతక్క తన చిన్నతనం నుంచే ప్రజలకు సేవచేసేవారు. 1986లో ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలో గోదావరి వరదల కారణంగా ములుగు చుట్టుపక్కన గ్రామాలన్నీ ముంపునకు గురయ్యాయి. ఆ సమయంలో ప్రజలకు సాయం చేయడానికి తన స్నేహితులతో కలిసి మూడురోజుల పాటు చందాలు వసూలు చేసి సుమారుగా 13,500 రూపాయలు జమ చేసి సాయం చేసారు. ఆ తరువాత పాఠశాలలో, వసతి గృహాలలో జరిగే అన్యాయాలను ఎదుర్కొన్నారు.

1988లో సీతక్క తన బావని స్పూర్తిగా తీసుకుని తుపాకీ చేతబట్టి అడవిబాట పట్టారు. ఉద్యమసమయంలోనే జనశక్తి కమాండర్ మేనబావ రాముతో సీతక్క వివాహం జరిగింది. ఆ తరువాత కొద్ది రోజులకు సీతక్క జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. సమాజంలో జరిగే అన్యాయాలను చూడలేక వారికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పడాల రామరెడ్డి లా కాలేజిలో ఎల్ ఎల్ బీ పూర్తి చేసారు. ఆ తరువాత వరంగల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసారు.

ఆ తరువాత రాజకీయరంగ ప్రవేశం పొందిన దలసరి అనసూయ అలియాస్ సీతక్క 2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై గెలిచి రెండవసారి అసెంబ్లీ కి ఎన్నికయ్యారు.

Tags:    

Similar News