భానుని ప్రతాపానికి సెగలు రేగుతున్నాయి. వేడిమి భరించటం ఎవ్వరికీ సాధ్యపడటంలేదు. దాదాపుగా అందరూ ఏసీని ఆశ్రయించి వేసవి తాపాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్మారు. రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తుంటే.. కనీస నిద్ర కోసం తప్పనిసరి పరిస్థితులలో కూలర్లు..కండిషనర్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్ల వాడకం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఒకప్పుడు ఎగువ తరగతి ప్రజలకు మాత్రమే.. అనుకునే ఏసీలు ఇపుడు అందరికీ తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఏసీల అధిక వినియోగంతో పర్యావరణానికి ముప్పని నిపుణులు చెబుతున్నా.. వేడిమిని తప్పించుకునే ఏకైక మార్గంగా జనం ఏసీలను భావిస్తున్నారు.పర్యావరణానికి చేటు అనేదాన్ని పక్కన పెడితే ఏసీల వినియోగంతో ఎన్నో ఇక్కట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
అతి శీతలమూ ప్రమాదమే!
మనది సమ శీతోష్ణ స్థితి వాతావరణం. వేడి, చలి అన్నిటిని సమానంగానే తీసుకోవాలి. మన శరీరం 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత ను కలిగిఉంటుంది. దానికి తగ్గట్టుగానే మన చుట్టూ ఉన్న వాతావరణం ఉండాలి. ఆ వేడి కన్నా మరీ ఎక్కువ వేడిని లేదా.. చల్లదనాన్ని తట్టుకోలేదు. కొద్దిపాటి తేడాను భరించడానికి మన శరీరం సన్నద్ధంగానే ఉంటుంది. అయితే, ఒక్కసారిగా పెరిగే ఎండను తట్టుకునే క్రమంలో మనం శీతలం కోసం ఎసిలను ఆశ్రయిస్తాము. గదిలో ఉన్న ఉష్ణోగ్రతని ఒక్కసారిగా 16 నుంచి 18 డిగ్రీలకు తగ్గించి పెడతాము. దీనితో శరీరానికి తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. కానీ, దీర్ఘకాలం లో పలు ఇబ్బందులకు గురి చేస్తుంది. బయట వేడి కన్నా బాగా తక్కువ చల్లదనం చర్మంపై ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మం కింది పొరపై ఈ ప్రభావం కనిపిస్తుంది. పొడిబారి దురద వస్తుంది. శరీరం ముడతలు పడుతుందని చర్మ వ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఇక ఏసీల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడటం చాలా మందికి అనుభవమే. ఏసీ సినిమా హల్లో సినిమా చూసి బయటకు వచ్చినపుడు వెంటనే మనకి ఎదురయ్యే ఇబ్బంది తెలిసిందే. ఇలా ఎనుదుకు జరుగుతుందంటే, శరీరానికి ఉండే ఉష్ణోగ్రతలను భరించే శక్తిని ఏసీలు హరిస్తాయి. దీంతో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అతి శీతలంగా ఉన్న ఏసీ గదిలో ఎక్కువసేపు గడిపితే శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయి.
ఎం చేయాలి?
గదిలో ఉష్ణోగ్రతను నియంత్రించుకునే సమయంలో ఏసీ టెంపరేచర్ 28 డిగ్రీలుగా ఉంచుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అదే విధంగా ఈసీని ఆన్ చేసిన తరువాత కనీసం అరగంట పాటు ఆ గదిలోకి వెళ్లకపోవడమే ఉత్తమమని వారు చెబుతున్నారు. అంటే, ఏసీ గదిలోకి వెళ్లే అరగంట ముందుగానే ఈసీని ఆన్ చేయాల్సి ఉంటుంది.
దోమలకు నెలవుగా మారొచ్చు..
ఏసీల వల్ల ఏర్పడే 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ వాతావరణం డెంగీ కారక దోమల వృద్ధికి అనుకూలమని భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. అందువల్ల గదిలో దోమలను నిరోధించే వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
పిల్లల విషయం లో మరింత జాగ్రత్త అవసరం..
చిన్నారులను ఎండ ఎక్కువగా ఉందని ఎక్కువగా ఏసీ గదుల్లోనే ఉంచేయడం వారి ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తుంది. సున్నితమైన వారి చర్మం ఆ చల్లదనానికి అలవాటు పడిపోయి తరువాత ఏ మాత్రం వేడి తగిలినా తట్టుకోలేని స్థితికి చేరుతుంది. అదే విధంగా శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీరానికి అవసరమైన ముఖ్యంగా పిల్లల పెరుగుదల లో కీలక పాత్ర పోషించే విటమిన్ డి వారికి అందే అవకాశాలు తగ్గిపోతాయి.
ఏసీల నిర్వహణ అతి ముఖ్యం..
సాధారణంగా ఏ వస్తువైనా కొన్న తరువాత, ఉచిత సర్వీసులు ఉన్నంత వరకు సర్వీసులు చేయిస్తాము. తరువాత దానిపై అంత శ్రద్ధ పెట్టము. ఏసీల విషయంలో ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. సమయానికి ఫిల్టర్లను శుభ్రం చేయనట్లయితే పుప్పొడి, ఫంగస్, బ్యాక్టీరియాలాంటివి చేరతాయి. ఏసీలోని గాలి అక్కడక్కడే తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్వాశ కోశ సంబంధిత ఇబ్బందులు ఎక్కువగా తలెత్తుతాయి. అదే విధంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు ఇష్టం వఛ్చినట్టు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మనం నీయఁత్రించే పరిస్థితి కోల్పోతాం. దీనితో గదిలో చల్లధనంలో మార్పులు వచ్చి ఇబ్బందులు తలెత్తుతాయి. కార్యాలయాల్లో, పాఠశాలల్లో ఏసీల నిర్వహణ లోపాలు మరిన్ని ఇబ్బందులు కలుగ చేస్తాయి. వాతావరణాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎసిలను తప్పనిసరిగా ఆయా కంపెనీలు సూచించిన విధంగా క్రమం తప్పకుండా నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏదిఏమైనా ఎండ తీవ్రతను తట్టుకోవడం కోసమని కృత్రిమ శీతలాన్ని ఆశించే ముందు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం తథ్యం.