బుల్డోజర్ బాబా టెన్ థౌజండ్ వాలా.. యోగి ఖాతాలో మరో రికార్డ్..

100 Days of Yogi 2.0: ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది ఎన్ కౌంటర్లు. అన్నీ అధికారికంగానే.

Update: 2022-07-07 09:11 GMT

బుల్డోజర్ బాబా టెన్ థౌజండ్ వాలా.. యోగి ఖాతాలో మరో రికార్డ్..

100 Days of Yogi 2.0: ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది ఎన్ కౌంటర్లు. అన్నీ అధికారికంగానే. సీఎం ఆదేశాలతోనే అవన్నీ జరుగుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరెన్ని ఆరోపణలు చేసినా తగ్గేదేలే అంటున్నారు. ఆయనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అధికారంలోకొచ్చిన నాటి నుంచి బుల్డోజర్ బాబాగా రూపాంతరం చేందే వరకు ఆయన హయాంలో జరిగిన ఎన్ కౌంటర్ల సంఖ్య సరికొత్త ల్యాండ్ మార్క్‌ను టచ్ చేయబోతోంది. మరి అధికారికంగా ఎన్ కౌంటర్లు చేయొచ్చా..? చట్టాలు ఏం చెబుతున్నాయి..? బాధితుల వెర్షన్ ఏంటి..?

యోగీ ఆధిత్యనాథ్. యూపీ సీఎంగా రెండోసారి అధికారం చేపట్టారు. చాలాకాలంగా నేరరాజ్యంగా వెలుగొందిన ఉత్తరప్రదేశ్‌ను తన మార్క్ పాలిటిక్స్ తో క్లీన్ చేస్తున్నారు. గల్లీకో రౌడీ, ఊరికో డాన్ చొప్పున మాఫియా అరాచకాలతో అత్యాచారాలు, కిడ్నాప్‌లు, వేధింపులు, హత్యలు, కబ్జాలు, డ్రగ్స్ వంటి నేరాలకు అడ్డాగా మారిన యూపీలో సరికొత్త పాలసీతో ముందుకు వెళ్తున్నారు. క్రైమ్ జరిగితే చాలు నేరగాడిపై వెంటనే యాక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. దొరికితే జైల్లోకి లేకుంటే ఎన్ కౌంటరే. ఈ రెండూ కాకపోతే బుల్డోజర్ ను రంగంలోకి దించుతున్నారు. నేరగాడి ఆస్తులను కూల్చేస్తున్నారు. అదీ కాకపోతే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదంగా గత ఐదేళ్లుగా జరుగుతున్న తతంగమే.

అయితే ఒక్క ఎన్ కౌంటర్ జరిగితేనే సవాలక్ష ప్రశ్నలు. పోలీసులు కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది. దాన్నుంచి బయటపడేందుకు నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. అలాంటిది యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ హయాంలో జరిగిన ఎన్ కౌంటర్ల సంఖ్య వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఏకంగా 10 వేల ల్యాండ్ మార్క్ కు దగ్గరగా ఉన్నాయి. వినడానికి భయంకరంగా ఉన్నా ఎన్ కౌంటర్లపై వాస్తవాలను ప్రభుత్వమే చెప్పుకొచ్చింది. యోగి తొలి విడుత ప్రభుత్వంలో ఏకంగా 9 వేల 434 ఎన్ కౌంటర్లు జరగ్గా రెండోసారి అధికారంలోకొచ్చిన మొదటి 100 రోజుల్లో మరో 525 ఎన్ కౌంటర్లు జరిగాయి. మొత్తం 9 వేల 959 ఎన్ కౌంటర్లు జరిగినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే సరాసరి రోజుకు 5 ఎన్ కౌంటర్లుగా లెక్కలు కడుతున్నారు. ఈ లెక్కన మరో వారం పది రోజుల్లో 10 వేల ఎన్ కౌంటర్లు పూర్తయ్యే అవకాశం ఉంది.

అంతెందుకు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వంద రోజుల్లో జరిగిన ఎన్ కౌంటర్ల సంఖ్యను ఏకంగా రిపోర్ట్ కార్డ్ పేరుతో బాహాటంగానే ప్రకటించింది యోగి సర్కారు. ఎవరెవరిని అరెస్టు చేశారు..? ఎందరు లొంగిపోయారు..? ఎందరు మరణించారు..? అలాగే ఎంతమంది పోలీసులు గాయపడ్డారో కూడా అధికారికంగానే ప్రకటిస్తోంది. కాన్పూర్ జిల్లా లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఏకంగా 8 మంది పోలీసులను హతమార్చిన ఘటన తర్వాత ఓ ఎన్ కౌంటర్ లో అతడు చనిపోయాడు. ఆ తర్వాత అతని ఇంటిని అధికారులు బుల్డోజర్ తో పడగొట్టారు. అప్పటి నుంచి బుల్డోజర్ బాబాగా యోగీ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత హత్యలు, కిడ్నాప్ లు చేసినా ఆరోపణలు ఎదుర్కొంటున్నా వారికి బుల్డోజర్ లతోనే సమాధానం చెబుతున్నారు.

అప్పటి నుంచే యోగీని బుల్డోజర్ బాబాగా పిలవడం మొదలుపెట్టారు. రెండోసారి అధికారం కోసం ఎన్నికల్లోకి వెళ్లినప్పుడు ర్యాలీల్లో ఏకంగా బుల్డోజర్ బొమ్మలను కూడా ప్రదర్శించారు. దీంతో బుల్డోజర్ పాప్యులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీనిపై యూపీలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. నేరస్తులను అణిచివేసేందుకు బుల్డోజర్లను ఉపయోగించడంలో తప్పేంలేదంటూ బీజేపీ సమర్థిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలకు దిగాయి. అయినా వెనక్కు తగ్గకుండా ఎన్నికల్లో రెండోసారి విజయాన్ని అందుకున్నారు యోగి ఆదిత్యనాథ్. అప్పటి నుంచి బుల్డోజర్ నినాదం ఇతర రాష్ట్రాలకూ పాకింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ బుల్డోజర్ జస్టిస్ ను అమలు చేస్తామనే స్టేట్ మెంట్ ఇస్తున్నారు.

అయితే నేరం జరిగిన వెంటనే బుల్డోజర్లు రంగంలోకి దిగడంపై సహజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే రేంజ్ లో విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. కావాలనే కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే బుల్డోజర్ జస్టిస్ అనేది న్యాయసమీక్షకు నిలబడదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నేరుగా బుల్డోజర్ తీసుకొచ్చి కట్టడాలు కూల్చివేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని మాజీ న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదంటున్నారు. ఒక ఇంటిని బుల్డోజరుతో ప్రభుత్వం కూల్చేయవచ్చా..? ఇది చట్టప్రకారం సరైన చర్యేనా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎలాంటి వివక్ష లేదని యోగీ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో యోగీ బుల్డోజర్ ట్రీట్ మెంట్ ఎక్కడి వరకు వెళ్తుంది..? న్యాయస్థానంలో యోగీ సర్కారు ఎలాంటి చిక్కులు ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ప్రశ్నగా ఉంది.

Tags:    

Similar News