Vinesh Phogat and Bajrang Punia: కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా.. కీలక వ్యాఖ్యలు

Update: 2024-09-06 09:58 GMT

Vinesh Phogat and Bajrang Punia: రెజ్లర్స్ వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై జరుగుతున్న న్యాయ పోరాటాన్ని ఉద్దేశించి వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. తమ పోరాటం ఇంకా ముగియలేదన్నారు. న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెబుతూ.. ఈ పోరాటంలో నా సోదరీమణులకు తాను అండగా ఉంటానన్నారు. మీకు ఎవ్వరు ఉన్నా.. లేకున్నా.. మీ కోసం తాను పోరాడుతానని హామీ ఇచ్చారు. ఇంతకాలం రెజ్లింగ్‌లో ఎలాగైతే మనసు పెట్టి కృషి చేశామో.. అలాగే ప్రజలకు సేవ చేసేందుకు కూడా రాజకీయాల్లో అంతే మనసు పెట్టి పనిచేస్తానని ఫోగట్ అభిప్రాయపడ్డారు.

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా.. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గెని కలిశారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతో భేటీ అయిన అనంతరం అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడే పార్టీ అగ్రనేతల సమక్షంలో వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.

త్వరలోనే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి వారితో టికెట్ కన్ఫమ్ చేయించుకునే పనిలో వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా బిజీగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నాడు అని అథ్లెట్స్ జరిపిన పోరాటంలో వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా, సాక్షి మాలిక్ ముందున్న సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News