Co-Vaccine: మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ పాలిటిక్స్
Co-Vaccine: వ్యాక్సినేషన్ నిల్వలు లేవన్న మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే * మరో మూడురోజులకే అందుబాటులోకి ఉన్నాయని వెల్లడి
Co-Vaccine: మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. వ్యాక్సిన్లు సరిపడా లేవంటూ మహారాష్ట్ర మంత్రి కామెంట్ చేయగా అదంతా అవాస్తవమని కొట్టిపారేసింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు తగవని హితవు పలికింది.
కోవిడ్ టీకాల పంపిణీ మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటలయుద్ధానికి తెరలేపింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే చేసిన కామెంట్ ఇందుకు కారణమైంది. తమ రాష్ట్రంలో మరో మూడు రోజుల్లో వ్యాక్సిన్ నిల్వలు పూర్తయిపోతాయన్నారు రాజేశ్ తోపే. పలుచోట్ల డోసులు లేక వ్యాక్సినేషన్ సెంటర్లు మూసివేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 4 లక్షల 50వేల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోందని ప్రస్తుతం 14 లక్షల డోసులు మాత్రమే మిగిలాయలని రాజేశ్ తోపే తెలిపారు. ఇవి మూడు రోజులకు మాత్రమే సరిపోతాయని కేంద్రం వారానికి 40 లక్షల డోసులు పంపాలని కోరారు.
రాజేశ్ తోపే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. ఆ ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని కొట్టిపారేశారు. కరోనాను మహారాష్ట్ర కట్టడి చేయలేకపోయిందని ఆ వైఫల్యాన్ని కప్పు పుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కరోనా టీకాపై రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
ఇక ఇప్పటికే వ్యాక్సిన్ల కొరతతో మహారాష్ట్రలోని సతారా, పాన్వెల్ సిటీల్లో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. టీకాలు సరిపడా అందుబాటులోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామని తెలిపారు. అటు ముంబైలోనూ వ్యాక్సిన్ కొరత ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో మహారాష్ట్ర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు రోజురోజుకూ కోవిడ్ బాధితులు పెరుగుతున్న సమయంలో టీకా అందుబాటులో లేకపోవం వారిని అయోమయానికి గురిచేస్తోంది.