Viral Video: నడిరోడ్డుపై పోకిరీల వీరంగం.. ఇద్దరు అమ్మాయిలకు ' నాన్‌స్టాప్ టార్చర్ '

Update: 2024-08-29 01:00 GMT

Viral Video Of Harassment On Two Women: ఓవైపు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంటే.. మరోవైపు ఇప్పటికీ మహిళలకు అడుగడుగునా వేధింపులు తప్పడం లేదని చెప్పే మరో ఘటన వెలుగుచూసింది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రాచీ జోషి అనే మహిళ పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే.. అమ్మాయిలకు అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీదే భద్రత కరువయ్యిందనిపిస్తోంది. బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం ఆమె తన స్నేహితురాలితో కలిసి సినిమా చూసి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె తన స్నేహితురాలు కలిసి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు 10 మంది ఆకతాయిలు విశ్వ ప్రయత్నాలు చేశారు. దాదాపు 25 నిమిషాల పాటు ఆకతాయిల వేధింపుల పర్వం కొనసాగింది.

" రోడ్డుపై మేం ఇంటికి వెళ్తుండగా.. మా ముందు ఒక వాహనం, మా వెనుక మరొక వాహనం చుట్టుముట్టాయి. ముందు ఒక వాహనం, వెనుకొక వాహనం ఉండటంతో మాకు తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. అలా వాళ్లు మమ్మల్ని తరుమూతూనే ఉన్నారు. ఒకసారి వాళ్ల బారి నుండి తప్పించుకున్నాం. మళ్లీ రెండోసారి చుట్టుముట్టారు. ఈసారి మాకంటే ముందు వెళ్తున్న T0724UK4618C నెంబర్ గల నలుపు రంగు స్కార్పియో వాహనంలో ఉన్న వ్యక్తులు మమ్మల్ని ఆపేందుకు గట్టిగా ప్రయత్నించారు. స్కార్పియో వాహనాన్ని ఆపి మమ్మల్ని కూడా అడ్డుకునేందకు ప్రయత్నించారు. కానీ అంతలోనే ఓ స్కూటర్ అటువైపుగా రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అంతలోనే వెనుకవైపు నుండి UK-04-AK-1928 నెంబర్ గల ఐ20 నియోస్ కారు మావైపే వేగంగా దూసుకొచ్చింది. వీడియోలో చూపించినట్లుగా కారులోంచి ఇద్దరు పోకిరి కుర్రాళ్లు సగం కాళ్లు బయటపెట్టి కారును పట్టుకుని వేళ్లాడుతూ మాపై ఏవేవో దుర్భాషలాడుతూ వెళ్లిపోయారు. అదృష్టం కొద్దీ ఎలాగోలా తప్పించుకున్నాం కానీ లేదంటే పరిస్థితి ఏంటి " అని బాధితురాలు ఆందోళన వ్యక్తంచేశారు.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో మంగళవారం రాత్రి తమకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి బుధవారం మధ్యాహ్నం వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఉత్తరాఖండ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ నడిరోడ్డుపై పరిస్థితి ఇలా ఉంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడుంది అని గట్టిగా నిలదీశారు. హల్ద్వానిలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తరాఖండ్ పోలీసులను డిమాండ్ చేశారు.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉత్తరాఖండ్ పోలీసు ఉన్నతాధికారులు.. అక్కడి నైనితాల్ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. వీడియో ఆధారంగా రెండు వాహనాలను (Black Scorpio, Hyundai i20 Nios) గుర్తించి, నిందితులను అరెస్ట్ చేసినట్లు నైనితాల్ ఎస్ఎస్పీ ప్రకటించారు.

రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులపై ఎఫ్ఐర్ నమోదు చేశామన్నారు. నైనితాల్ జిల్లాలో ఆకతాయిలు పోకిరి వేషాలేసినా, మహిళలను వేధించినా, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి వాహనాలతో రోడ్లపై తిక్కతిక్క వేషాలేసినా.. వెంటనే వారి వాహనాలు సీజ్ చేసి నిందితులను జైలుకి పంపిస్తాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మధ్యాహ్నం పోస్ట్ అయిన వీడియోపై పోలీసులు కూడా అంతే వేగంగా స్పందించి సాయంత్రంలోగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను దాదాపు అరగంటసేపు ఏడిపించి రాక్షాస ఆనందం పొందిన ఆకతాయిలు ఇప్పుడు పోలీసుల మర్యాదలతో జైల్లో కూర్చుని ఊచలు లెక్కబెడుతున్నారు.

Tags:    

Similar News