PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్ 2000లతో పాటు నెలకు 3000 పెన్షన్ పొందే అవకాశం..

PM Kisan:

Update: 2021-11-14 11:15 GMT

ప్రధానమంత్రి శ్రమ యోగి మాంధాన్ యోజన (ఫైల్ ఇమేజ్)

PM Kisan: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులను ఆదుకునేందుకు పీఎం కిసాన్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలు అందిస్తారు. మూడు విడతలుగా 2000 రూపాయల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తారు. ఇప్పటి వరకు తొమ్మిది విడతలుగా రైతులకు నగదు బదిలీ చేసింది. తాజాగా పదో ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్‌ 15లోపు అకౌంట్లలో జమకానుంది. అయితే ఇప్పుడు రైతులకు ఈ రెండు వేలతో పాటు మరో మూడువేల పెన్షన్ పొందే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన కింద రైతులు ప్రతి నెలా కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారీ పెన్షన్ పొందవచ్చు. రైతులు వ్యవసాయం వదిలేసి రిటైర్‌మెంట్‌ దశలో ఉన్న తరుణంలో ఈ డబ్బు వారికి ఆసరాగా ఉంటుంది. ఈ పథకంలో రైతులకు 60 ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ ప్రారంభమవుతుంది.

ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన కోసం నమోదు చేసుకోవడానికి రైతులు అనేక పత్రాలను సమర్పించాలి. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు పథకం కోసం ప్రత్యేకంగా నమోదు చేసుకోవలసిన అవసరం లేదు.

18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ఏ రైతు అయినా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. నెలకు రూ.3000 పింఛను పొందవచ్చు. అయితే పెట్టుబడిని సరైన సమయంలో ప్రారంభించినప్పుడు ఈ పెన్షన్ ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి. నెలకు రూ.3000 పొందడానికి రైతులు వారి ప్రస్తుత వయస్సును బట్టి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి కూడా ఈ బీమా పథకం ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. 60 సంవత్సరాల వయస్సు తర్వాత రైతులకు 3000 రూపాయల పెన్షన్ అందిస్తారు.

Tags:    

Similar News