Andhra Pradesh: నేడు విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ
Vibhajana Committe: ఏపీ, తెలంగాణ నుంచి హాజరుకానున్న అధికారులు.
Vibhajana Committe: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఎనిమిది ఏళ్లు కావస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా అనేక సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. అయితే ఇటీవలే తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవాళ ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా తొలి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంపై అందరి ఫోకస్ పడింది. కమిటీలో సభ్యులుగా ఏపీ నుంచి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్, తెలంగాణ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఏ అంశాలు చర్చించాలన్న దానిపై అధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం అందించింది. ప్రధానంగా ఐదు అంశాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు, పన్ను అంశాలపై తలెత్తిన లోపాల పరిష్కారం, బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్ల పంపిణీ, APSCSCL, TSCSCL మధ్య నగదు అంశంపై ప్రధానంగా చర్చిస్తారు.
అయితే ఎజెండాలో తొలుత మొత్తం 9 అంశాలను చేర్చిన కేంద్ర హోం శాఖ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు. దీంతోపాటు మరో మూడు అంశాలను కూడా తొలగించారు. వీటిపై కూడా దుమారం రేగుతోంది. మరోవైపు ఇప్పటివరకు కేంద్రం దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సమస్యల్లో ఒక్కటైనా ఎజెండాలో పెట్టలేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.