Cyclone Dana: దానా సైక్లోన్ దారెటు?
Cyclone Dana: దానా తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి. ఒడిశా మీదుగా వెళ్లే 198 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. బెంగాల్, ఒడిశాలో స్కూల్స్ కూడా మూతపడ్డాయి. 5వేలకు పైగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని..దాదాపు 10లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందని ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి సురేశ్ పూజారి తెలిపారు.
Cyclone Dana: దానా తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావం ఏపీతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈనెల25వ తేదీ తెల్లవారుజామున తీరం దాటనున్న నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అలర్ట్ అయ్యాయి. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు.
దీంతో విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించే యోచనలో ఉన్నారు. ఒడిశా ప్రభుత్వం 14 జిల్లాల్లోని 3వేల గ్రామాల నుంచి 10లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించేందుకు యోచిస్తోంది. రాబోయే తుపాన్ వల్ల రాష్ట్ర జనాభాలో సగం మంది ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దానా తుపానును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తుఫాన్ కారణంగా ఏవైనా ఆకస్మిక పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే స్పందించేందుకు అప్రమత్తంగా ఉన్నామని నౌకలు, విమానాలను సిద్ధంగా ఉంచామని ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. అటు తుపాన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు ఒడిశాలో రెస్య్కూ, రిలీఫ్ ఆపరేషన్లలో సమన్వయం చేసుకోవాలని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఎమ్మెల్యేలకు సూచించారు.
ఒడిశాలోని పూరీ నుంచి తూర్పు తీరం మొత్తం, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం తీరం మొత్తం దానా తుపాన్ ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్న ఒడిశాలో సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలంతా సమన్వయం చసుకోవాలని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ కోరారు. ముంపునకు గురయ్యే ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లు , ఫ్లడ్ షెల్టర్లు ఇతర భవనాలను ఏర్పాటు చేశారు. ఆహారం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి తెలిపారు.