Top 6 News Of The Day: తెలంగాణలో చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ వార్నింగ్.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్

Update: 2024-09-03 12:39 GMT

1) మరో రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటును సముద్ర మట్టం నుంచి 3కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని చెప్పారు.

2) ఏపీలో కుట్రలు.. సీఎం చంద్రబాబు సీరియస్

ఏపీలో కుట్రలు జరుగుతూనే ఉన్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలను పక్కదారి పట్టించేలా కొందరి వ్యవహారం ఉందని మాజీ సీఎం జగన్‌పై ఆయన పరోక్షంగా స్పందించారు. ప్రజలు ఇబ్బందుల్లో వరద ప్రభావిత ప్రాంతంలో గుడ్లవల్లేరు ఘటన మాట్లాడటమేంటని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజకీయం ముసుగులో నేరస్థులుగా మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఐదేళ్లుగా అధికార వ్యవస్థలేవీ పనిచేయలేదన్నారు సీఎం చంద్రబాబు. ఎమర్జెన్సీ టైమ్‌లో అధికారులు సరిగ్గా పనిచేయకపోతే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ఆయన ఆదేశించారు. జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. మంత్రులు కూడా చెప్పిన పని చేయకపోతే వాళ్లపైనా చర్యలకు వెనుకాడబోనని తేల్చిచెప్పారు. విజయవాడ కలెక్టరేట్‌ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్‌ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని.. బాధితులకు మూడు పూటలా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు.

3) 50లక్షల ఆర్థిక సాయం చేయాలి..

వరదల్లో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం 50లక్షల ఆర్థిక సాయం చేయాలని మల్కాజిగిరి ఎంపీ‌ ఈటల రాజేందర్ కోరారు. కోతకు గురైన చెరువులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలన్నారు. కొట్టుకుపోయిన పంటకే కాకుండా.. నీటిలో నానిన పంటకు సైతం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని తెలిపారు. వరద బాధితులకు బీజేపీ అండగా ఉంటోందన్నారు ఈటల రాజేందర్ .

4) చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్.. చెరువుల కబ్జాల కారణంగానే వరదలు వస్తున్నాయన్నారు. ఇకపై ఆక్రమణలను ప్రభుత్వం ఉపేక్షించబోదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను చెరువుల్లో కబ్జాలపై లిస్ట్ రెడీ చేయాలని ఆదేశించారు. హైడ్రా లాంటి వ్యవస్థను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు సీఎం రేవంత్.

5) విజయవాడలో తాజా పరిస్థితి

బెజవాడ ప్రజలను భారీ వరదలు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినప్పటికీ ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని చెప్పారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయి వరద నీరు చేరింది. ఎన్నడూ లేనంతగా 11 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు చేరడంతో ఇదే రికార్డుస్థాయి వరద అంటూ జలవనరుల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. పై నుంచి నీటి ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 9 లక్షల 79 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది.

6) కేజ్రీవాల్‌కి షాక్

ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్ పాఠక్‌లకు సమన్లు జారీ చేసింది. కేసు విచారణ సెప్టెంబర్ 11న జరగనుంది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్‌ను విడుదల చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Tags:    

Similar News