Top 6 News @ 6 PM: ముగిసిన రతన్ టాటా శకం.. ఆయన సాధించిన విజయాలు.. మరో టాప్ 5 న్యూస్ హెడ్‌లైన్స్

Update: 2024-10-10 12:42 GMT

1) Ratan Tata: ముగిసిన రతన్ టాటా శకం.. ఆయన సాధించిన విజయాలు ఇవే.. టాటా సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకూ చెరగని ముద్ర

రతన్ టాటా మరణంతో భారత వ్యాపార ప్రపంచంలో ఒక శకం ముగిసింది. అక్టోబర్ 9 బుధవారం రాత్రి 11 గంటలకు రతన్ టాటా ముంబయిలోని బీచ్ క్యాండీ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్ళు. టాటా అంటే గుండు పిన్నీసు నుంచి విమానాల వరకు... ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ వరకూ విస్తరించిన ఒక మహా వ్యాపార సామ్రాజ్యం. 155 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ చైర్మన్లలో అత్యంత శక్తిమంతమైన ప్రభావవంతమైన చైర్మన్ గా రతన్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. టాటా అంటే రతన్ టాటా అనే స్థాయికి గ్రూప్ కంపెనీలను తీసుకెళ్లారంటే.. ఆయన ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28వ తేదీ ముంబైలోని పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి నావెల్ టాటా,తల్లి సూనీ టాటా. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) Defamation Case: కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా

కొండా సురేఖపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో గురువారం కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 2న కేటీఆర్ పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీనటులు నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో కేటీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా ఉన్నారని ఆ పిటిషన్ లో ఆయన చెప్పారు. ఇదే విషయంలో ఇప్పటికే సినీ నటులు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు అక్కినేని నాగార్జునతో పాటు సాక్షుల నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. ఈ పిటిషన్ పై కొండా సురేఖకు నాంపల్లి కోర్టు గురువారం నోటీసులు పంపింది.

3) Defamation Case: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

Defamation Case: సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి..తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

4) Vinod Kumar: మార్కెటింగ్‌లో రేవంత్‌ను మించినోడు లేడు.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Vinod Kumar: తెలంగాణలో నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామక పత్రాల కేంద్రంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఉపాధ్యాయుల నియామకాల‌ ప్రోగ్రాంను సీఎం రేవంత్‌ రాజకీయ వేదికగా వాడుకున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. మార్కెటింగ్‌లో రేవంత్ రెడ్డిని మించినోడు లేడని..గత ప్రభుత్వ నోటిఫికేషన్లనూ ఆయనే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని వినోద్ విమర్శించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో ల‌క్షా 60 వేల ఉద్యోగాలను కేసీఆర్ భ‌ర్తీ చేయ‌లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి,ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్రమార్క చెప్పగ‌ల‌రా..? అని స‌వాల్ విసిరారు వినోద్. నిన్న మీరు ఇచ్చిన ఉపాధ్యాయ నియామకాలు కూడా సెప్టెంబర్ 6, 2023 నాడు ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపే. కేవలం ఆరు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్‌లో అదనంగా కలిపార‌ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

5) Ratan Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం

దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్‌ను సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా క్యాబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముంబై బయలుదేరి వెళ్లారు.

6) Rafael Nadal: టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్

Rafael Nadal: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు. గత రెండేళ్లు కఠినంగా గడిచాయని..ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టిందన్నాడు. జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం ముగింపు అనేది ఉంటుందన్న రఫెల్.. డెవిస్ కప్ తర్వాత..ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు నాదల్.

క్లే కోర్టు రారాజుగా వెలుగొందిన నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించాడు. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశించాడు. మరో నాలుగు సంవత్సరాలకే తొలి టైటిల్‌.. 2005-ఫ్రెంచ్‌ ఓపెన్ ను తన ఖాతాలో వేసుకొని ఒక్కసారిగా క్రీడాలోకాన్ని తనవైపు చూసేట్లు చేశాడు. ఈ స్పెయిన్ బుల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్‌ టైటిళ్లు సాధించాడు. ఇందులో 14 ఫ్రెంచ్‌ ఓపెన్ టైటిల్స్‌ ఉన్నాయి.

Tags:    

Similar News