Thief: ‘తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తున్నా... క్షమించండి’...
దొంగతనం చేసిన ఇంట్లో ఓ దొంగ లేఖ వదిలి వెళ్లారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.
Apology Letter: నన్ను క్షమించండి... తప్పని పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వచ్చింది. నెల రోజుల్లో మీ ఇంట్లో వస్తువులను తిరిగి ఇచ్చేస్తానని దొంగతనం చేసిన ఇంట్లో ఓ దొంగ లేఖ వదిలి వెళ్లారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.
తమిళనాడు మేఘనపురం శాంతనకుళం రోడ్డులో రిటైర్డ్ టీచర్ సెల్విన్ తన భార్యతో కలిసి ఉంటున్నారు. ఆయన భార్య కూడా టీచర్ గా పనిచేసి రిటైరయ్యారు. వీరి కొడుకు సెల్విన్ చెన్నైలో ఉంటున్నారు.
ఈ ఏడాది జూన్ 17న తన కొడుకు ఇంటికి రిటైర్డ్ టీచర్ దంపతులు వెళ్లారు. 9 రోజుల తర్వాత అంటే జూన్ 26న ఈ దంపతులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోని రూ. 60 వేల నగదు, 12 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని గుర్తించారు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల రోజుల్లో మీ వస్తువులు తిరిగి ఇస్తా
సెల్విన్ ఇంట్లో పోలీసులు క్లూ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ లెటర్ దొరికింది. నన్ను క్షమించండి... నెల రోజుల్లో మీ వస్తువులను తిరిగి ఇస్తాను.. మా ఇంట్లో ఒకరికి ఆనారోగ్యంగా ఉన్నందున దొంగతనం చేయాల్సి వచ్చిందని ఆ లేఖలో దొంగ రాశారు. ఈ లేఖతో పాటు సమీపంలోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా దొంగ ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత ఏడాది కేరళలో మూడేళ్ల చిన్నారి నుండి బంగారు నెక్లెస్ ను ఓ వ్యక్తి దొంగిలించారు. అయితే ఈ గొలుసు విక్రయించగా వచ్చిన నగదుతో పాటు క్షమాపణ లేఖతో తిరిగి బాలిక ఇంటి వద్ద వదిలివెళ్లారు. ఈ ఘటన పాలక్కాడ్ కు సమీపంలోని గ్రామంలో జరిగింది.