TOP 6 News @ 6 PM: నాకు లంచం ఆఫర్ చేసినట్టు ఎక్కడైనా ఉందా... జగన్: మరో 5 ముఖ్యాంశాలు
అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.
1. అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదు
అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఎఫ్ బీ ఐ చార్జీషీట్ లో తన పేరు ఎక్కడా లేదని కూడా ఆయన తెలిపారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ కంపెనీ తనకు లంచాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు.
తనకు లంచం ఆఫర్ చేసినట్టు ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారికి లీగల్ నోటీసులు ఇస్తామని ఆయన తెలిపారు. అదానీని తాను చాలాసార్లు కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.
2. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇండియా కూటమి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జార్ఖండ్ కు సోరెన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో ఆయన మూడుసార్లు ఈ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం 34 చోట్ల గెలిచింది. బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్ ) (ఎల్) రెండు, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్ ), జేఎల్ కేఎం, జేడీయూ ఒక్కో స్థానంలో గెలిచాయి.
3. ఇస్కాన్ పై నిషేధానికి ఢాకా హైకోర్టు నిరాకరణ
ఇస్కాన్ పై నిషేధం విధించేందుకు ఢాకా హైకోర్టు గురువారం నిరాకరించింది. ఇటీవల నెలకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో హిందూ సంస్థ కార్యకలాపాలపై నిషేధం విధించాలని పిటిషనర్ వాదనను హైకోర్టు తిరస్కరించింది. ఇస్కాన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని.. దీనిపై నిషేధం విధించాలని పదిమందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవర్చారనే ఆరోపణలపై ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు.
4. అధికార భాష సంఘం మాజీ అధ్యక్షుడు విజయబాబుకు రూ. 50 వేల జరిమానా
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని అరెస్ట్ చేస్తున్నారని అధికార భాష సంఘం మాజీ అధ్యక్షులు విజయబాబు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ విజయబాబుకు రూ. 50 వేల జరిమానా విధించింది. నెల రోజుల్లో లీగల్ సర్వీస్ అథారిటీలో రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
5. మళ్లీ 24 వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నెలకొన్న అనిశ్చితి మార్కెట్ పతనానికి కారణమైంది. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 24 వేల పాయింట్ల దిగువకు చేరింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 2 లక్షల కోట్ల క్షీణించి రూ. 443 లక్షల కోట్లకు చేరింది.
6. ఎంపీగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీ
వయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ గురువారం ప్రమాణం చేశారు. వయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంకగాంధీ భారీ మెజారిటీతో గెలిచారు. కేరళ సంప్రదాయం ప్రతిబింబించే కసావు చీర ధరించి ఆమె సభకు హాజరయ్యారు. స్పీకర్ ఓంబిర్లా సభ ప్రారంభం కాగానే ఆమెతో ప్రమాణం చేయించారు. వయనాడ్ లో రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి గెలిచారు.