నేడు పట్టాలెక్కనున్న మొట్టమొదటి డ్రైవర్‌లెస్ ట్రైన్
* దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత రైలుగా రికార్డ్ * ఇవాళ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోడీ * ఆటోమేటెడ్ ట్రైన్‌లో అనేక ప్రత్యేకతలు
భారత్‌లో డ్రైవర్‌లెస్ ట్రైన్ నేటి నుంచి పట్టాలెక్కనుంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమెటెడ్ డ్రైవర్‌లెస్ రైలును ఢిల్లీలో ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ తన చేతుల మీదుగా ఈ హైటెక్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. దాంతో.. ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్‌లో ఆటోమేటెడ్ రైలు పట్టాలపై ఇవాల్టి నుంచే పరుగులు పెట్టనుంది.
2017 డిసెంబర్‌లో ఢిల్లీ మెట్రోలోని పింక్ లైన్‌లో 20 కిలోమీటర్లు స్ట్రెచ్‌లో ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో అన్‌అటెంటెడ్ ట్రైన్ ఆపరేషన్స్, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది. ఢిల్లీ మెట్రో రైల్ నెట్‌వర్క్‌లో లైన్-7, లైన్-8కే డ్రైవర్‌లెస్ రైళ్లు పరిమితం కానున్నాయి. UTO, CBTC సదుపాయాలు ఈ లైన్లలోనే ఉన్నాయి. ఫేజ్ 3 మెట్రోలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇక మొట్ట మొదటి డ్రైవర్‌లెస్ రైలు లైన్ 7లో పరుగులు పెట్టనుంది.
మరోవైపు.. డ్రైవర్‌లెస్ రైలును ఢిల్లీ మెట్రో పరిధిలోని మూడు కమాండ్ సెంటర్ల ద్వారా నియంత్రిస్తారు. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయం ఉండదు. రైల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా CBTC టెక్నాలజీ సాయంతో వెంటనే పరిష్కరించవచ్చు. హార్డ్‌వేర్ రీప్లేస్‌మెంట్ సమయంలో మాత్రమే మనుషుల అవసరం ఉంటుంది. మిగతా అంతా ఆటోమేటిగ్గానే జరిగిపోతుంది. ప్రస్తుతం సరికొత్త హంగులతో పరుగులు పెట్టనున్న ఈ రైల్లో ప్రయాణించేందుకు ఢిల్లీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.