పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద
Swami Sivananda: 125 వయస్సులో అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డ్
Swami Sivananda: చేసే పనిలో నిస్వార్థం నిబద్దత ఉంటే గుర్తింపు ఎప్పటికైనా వరిస్తుందన్నది మరోసారి రుజువైంది. అలా 125 ఏళ్ల యోగా గురువుకు పద్మశ్రీ వరించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మశ్రీ అవార్డులో ఈసారి ఈ అవార్డు అందుకున్నవారిలో అంత్యంత ఎక్కువ వయోవృద్దుడు కూడా ఉన్నారు. ఆయన ఒడిశాకు చెందిన ప్రముఖ యోగా గురువు స్వామి శివానంద. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డులు అందుకున్న వారిలో ఆయన కూడా ఒకరు.
స్వామి శివానంద మూడు దశాబ్దాలకు పైగా కాశీ ఘాట్ లలో యోగాభ్యాసంలో శిక్షణ ఇస్తున్నారు. నిరాడంబరమైన జీవనాన్ని గడుపుతూ ఇప్పటికీ తన చుట్టూ పక్కల వారికి సేవ చేస్తున్నాడు. అలా యోగా రంగంలో స్వామి శివానంద చేసిన విశేష కృషికి గాను ఆయనకు ఈసారి పద్మశ్రీ అవార్డు లభించింది. సోమవారం రాష్ట్రపతి భవన లో జరిగిన పద్మశ్రీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా స్వామి శివానంద పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలా భారత దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కారు పెద్దాయన.
అయితే ఆయన అవార్డు అందుకున్న తీరుకు ఇప్పుడు దేశ రాష్ట్రప్రతి, ప్రధాన మంత్రే కాదు. నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. పద‍్మ శ్రీ అవార్డు అందుకునే ముందు యోగా గురువు స్వామి శివానంద ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి కూడా పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో ప్రధాని ప్రతినమస్కారం చేయగా రాష్ట్రపతి కోవింద్ ప్రేమ తో ఆయనను పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.