కోల్‌కతా డాక్టర్స్ ధర్నా స్థలం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్.. బాంబ్ స్క్వాడ్ ఎంట్రీ

Update: 2024-09-12 10:33 GMT

Kolkata Doctors Protest Site: కోల్‌కతాలోని ఆర్‌జి కార్ హాస్పిటల్ బయట డాక్టర్స్ ఆందోళన చేపడుతున్న స్థలంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక బ్యాగ్ లభించింది. నలుపు రంగులో ఉన్న ఈ బ్యాగ్‌ ఎవరిది, అక్కడ ఎవరు తెచ్చిపెట్టారు అనే విషయంలో స్పష్టత లేదు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బాంబు స్క్వాడ్‌ని పిలిపించారు. ఆ బ్యాగులో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి ఆ బ్యాగ్ సమీపంలోకి ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు చుట్టుముట్టారు.

కోల్‌కతాలో ఇదే ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్‌కి గురైన అనంతరం డాక్టర్స్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు 34వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళన విరమించి విధుల్లో చేరాల్సిందిగా పలుమార్లు పశ్చిమ బెంగాల్ సర్కారు, సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ... ఇప్పటికీ డాక్టర్స్ తమ నిరసనను వీడటం లేదు. హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్‌కి న్యాయం జరిగేంతవరకు తమ న్యాయ పోరాటం ఆగదని డాక్టర్స్ తెగేసి చెబుతున్నారు.  

డాక్టర్ల చేత ఆందోళన విరమింపజేసేందుకు పశ్చిమ బెంగాల్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. నిన్న బుధవారం కూడా డాక్టర్లను చర్చలకు ఆహ్వానిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ ఒక ఈమెయిల్ పంపించారు. అయితే, తాము చర్చలకు రావాలంటే తమకు కొన్ని షరతులు ఉన్నాయంటూ డాక్టర్స్ రిప్లై ఇచ్చారు. అందులో మొదటి షరతు ఏంటంటే.. ఈ చర్చలకు 30 మంది ప్రతినిధుల బృందాన్ని అనుమతించాలి. సీఎం మమతా బెనర్జి కూడా ఈ చర్చల సమావేశానికి హాజరు కావాలి అనేది వారి రెండో షరతు. అలాగే ఈ చర్చలకు సంబంధించిన సమావేశాన్ని అందరూ వీక్షించేలా లైవ్ టెలికాస్ట్ చేయాలని డాక్టర్స్ షరతు విధించారు. దీంతో ఆ చర్చలు కాస్తా వాయిదా పడ్డాయి.

Tags:    

Similar News