Arvind Kejriwal Bail: దిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కు బెయిల్: ఐదున్నర నెలల తర్వాత జైలు నుంచి బయటకు
Arvind Kejriwal Bail: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
Arvind Kejriwal Bail: అరవింద్ కేజ్రీవాల్ కు దిల్లీ లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిలిచ్చింది. ఇదే కేసులో ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. కోర్డు ఆర్డర్ జైలు అధికారులకు అందించిన తర్వాత ఆయన విడుదలకానున్నారు.
బెయిల్ కండిషన్లు ఇవీ...
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసే సమయంలో కొన్ని షరతులను విధించింది. 10 లక్షల పూచీకత్త, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కూడా కోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు కూడా చేయవద్దని కూడా తెలిపింది.
ఐదున్నర నెలల తర్వాత జైలు నుండి బయటకు
లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. మరో వైపు ఇదే కేసులో సీబీఐ అధికారులు ఈ ఏడాది జూన్ 26న అరెస్ట్ చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈడీ కేసులో జూలై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు లోక్ సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ ఏడాది మేలో మధ్యంతర బెయిల్ ఇచ్చారు. గడువు ముగియడంతో ఈ ఏడాది జూన్ 2న ఆయన కోర్టులో లొంగిపోయారు.సీబీఐ కేసులో సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలకానున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించడంతో ఆప్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కు బెయిల్ లభించడంతో ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. దిల్లీకి సమీపంలో ఉన్న ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉంది.
దిల్లీ లిక్కర్ స్కాం అంటే ఏంటి?
2021 వరకు దిల్లీలో ప్రభుత్వమే మద్యం విక్రయించేది. అయితే, దీన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు 2021లో దిల్లీలోని ఆప్ సర్కారు కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది.ఈ కొత్త విధానం రూపకల్పనలో దిల్లీ ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోదియా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, మొత్తంగా ఈ కొత్త విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.580 కోట్ల కంటే ఎక్కువే నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ మేరకు అప్పటి దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు నివేదిక పంపారు.
కొంతమంది లిక్కర్ వ్యాపారులకు డిస్కౌంట్లు, లైసెన్సు ఫీజుల్లో మినహాయింపుల వంటి మేలు చేసేందుకు వారి నుంచి ఆప్ నాయకులు ముడుపులు తీసుకున్నారని నివేదికలో ఆరోపించారు. ఈ విషయమై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వివాదంపై 2022 ఆగస్టులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు.
దిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలపై ఫోకస్ చేయనున్నారు. దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని కేజ్రీవాల్ ప్లాన్ చేస్తున్నారు.