Supreme Court's Appeal To Doctors: డాక్టర్లకు సుప్రీం కోర్టు అప్పీల్.. స్పందించిన డాక్టర్స్
Supreme Court's Appeal To Protesting Doctors: కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు డాక్టర్లకు ఓ అప్పీల్ చేసింది. కోల్‌కతా ఘటన అనంతరం విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టిన డాక్టర్లని ఉద్దేశించి మాట్లాడుతూ.. వైద్యులు తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా సూచించింది. వైద్య సేవల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు పేర్కొంది. అంతేకాదు.. ఈరోజే డ్యూటీలో చేరే వైద్య సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోబోం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజే విధుల్లో చేరేవారిపై కఠిన చర్యలు తీసుకోకుండా చూసే బాధ్యత తీసుకుంటాం అని కోర్టు స్పష్టంచేసింది.
డాక్టర్లు విధుల్లో చేరకుండా రోగులకు వైద్య సేవలు ఎలా అందుతాయని ఈ సందర్భంగా కోర్టు డాక్టర్లను ప్రశ్నించింది.
సుప్రీం కోర్టు అప్పీల్‌పై స్పందించిన ఢిల్లీలోని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్.. తక్షణమే తమ ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కోల్‌కతా ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టినందుకు సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్లకు భద్రత కల్పించే అంశాలపై నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ల బృందం హర్షం వ్యక్తంచేసింది.