Sitaram Yechury: సీతారాం ఏచూరి చదువుతుంటే.. ఇందిరా గాంధీ వింటున్నారు.. ఈ ఫోటో వెనుకున్న అసలు స్టోరీ తెలుసా?

Update: 2024-09-13 01:45 GMT

Sitaram Yechury Student Life Politics: కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఆ ఫోటోలో ఇందిరా గాంధీ, సీతారాం ఏచూరి.. ఇద్దరూ ఉన్నారు. యువకుడిగా ఉన్న సీతారాం ఏచూరి చేతిలో ఏదో పేపర్ ఉంది. ఆయన ఆ పేపర్లో ఉన్నది చదువుతుంటే, అప్పటి ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ ఆ మాటలు ఏకాగ్రతతో వింటున్నట్లుగా ఆ ఫోటో ఉంది. వారికి ఇరువైపులా పోలీసులు, ఇంకొంతమంది జనం ఉన్నారు. సీతారాం ఏచూరి ఏం చదువుతున్నారా అని ముందున్న యువతీయువకులు వింటున్నారు. ఇది సీతారాం ఏచూరి ఢిల్లీ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ వేదికగా విద్యార్థి రాజకీయాల్లో కీలకంగా ఉన్న రోజుల్లో తీసిన ఫోటో.

ఇందిరా గాంధీని, సీతారాం ఏచూరిని ఒకే ఫ్రేములో చూపిస్తున్న ఈ ఫోటో గురించి గతంలో సోషల్ మీడియాలో సంబంధం లేని కథనాలు వైరల్ అయ్యాయి. అదేంటంటే.. "ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సీతారాం ఏచూరి పోరాటం చేసినందుకు ఢిల్లీలోని జేఎన్‌యూ యూనివర్శిటీకి పోలీసులతో వచ్చిన ఇందిరా గాంధీ.. అక్కడ ఏచూరిని పోలీసుల చేత చిత్రహింసలకు గురిచేసి ఆయనతో బహిరంగంగా క్షమాపణలు చెప్పించుకున్నారు" అని. సీతారాం ఏచూరి క్షమాపణలు చెబుతుండగా.. ఇందిరా గాంధీ వింటున్నట్లుగా ఈ ఫోటో గురించి అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి.

కానీ వాస్తవానికి ఈ ఫోటో స్టోరీ వెనుకున్న అసలు కథ వేరే..

ఈ ఫోటోగ్రాఫ్ జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో తీసినది కాదు.. ఇందిరా గాంధీ ఇంటి ఎదురుగా ఉన్న ఆవరణలో తీసిన ఫోటో. 1977 లో ఎమర్జెన్సీని ఎత్తేసిన తరువాత తీసిన ఫోటో ఇది. అప్పట్లోనే జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్‌కి సీతారాం ఏచూరి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నిక అయీ అవడంతోనే సీతారాం ఏచూరి నేరుగా ఇందిరా గాంధీ ఇంటి ముందే ధర్నాకు పిలుపునిచ్చారట. యూనివర్శిటీ విద్యార్థులను వెంటేసుకుని వెళ్లి ఇందిరా గాంధీ ఇంటి ముందే ధర్నాకు బైఠాయించారు. యూనివర్శిటీ ఛాన్స్‌లర్‌గా కొనసాగే అర్హత ఇందిరా గాంధీకి లేదని.. అందుకే ఛాన్స్‌లర్‌ పోస్టుకి ఆమె రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆ ధర్నా చేపట్టారు. ఇంటి ముందు ధర్నా నేపథ్యంలో ఇంటి నుండి బయటికొచ్చిన ఇందిరా గాంధీ.. స్టూడెంట్స్ డిమాండ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే స్టూడెంట్స్ డిమాండ్స్‌తో కూడిన పత్రాన్ని సీతారాం ఏచూరి చదివి వినిపిస్తుండగా తీసిన ఫోటోగ్రాఫ్ ఇది.

ఎమర్జెన్సీ తరువాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ ఆమె యూనివర్శిటీ ఛాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదని వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.

స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో (SFI) చేరడం ద్వారా సీతారాం ఏచూరి తొలిసారిగా విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత 1975 లో సీపీఐఎంలో చేరి దేశ కమ్యూనిస్ట్ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.

1975 లో సీతారాం ఏచూరి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డి చేస్తున్నారు. అదే సమయంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ సీతారాం ఏచూరి విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేశారు. నేతలతో పాటు జైలుకి వెళ్లారు. సీతారాం ఏచూరి పీహెచ్‌డి మధ్యలోనే ఆగిపోయిందని ఆయన జీవితాన్ని దగ్గరిగా చూసిన వాళ్లు చెబుతుంటారు.

జైలు జీవితం నుండి బయటికొచ్చిన సీతారాం ఏచూరి వరుసగా మూడుసార్లు జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్‌కి నాయకుడిగా ఎన్నికయ్యారు. జైలులోనే ఆయనకు ప్రకాశ్ కారత్ వంటి కమ్యూనిస్ట్ అగ్రనేతలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సీతారాం ఏచూరి జీవిత ప్రయాణంగా మారిపోయింది. ఆ ఉద్యమాల ప్రయాణంలో ఆయన ముందుకే సాగిపోయారు కానీ ఏనాడూ, ఎవరికీ జంకలేదు.. వెనక్కి తిరిగి చూసుకోలేదు.  

Tags:    

Similar News