Farmers: యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో పంజాబ్ రైతులు డిసెంబరు 6 (శుక్రవారం)ఢిల్లీ మార్చ్ ప్రకటించారు. పాటియాలా-అంబాలా సరిహద్దులో ఉన్న శంభు సరిహద్దు వద్దకు పెద్ద సంఖ్యలు రైతులు చేరుకుంటున్నారు. రైతుల కవాతును అడ్డుకునేందుకు హర్యానా ప్రభుత్వం భారీగా బలగాలను రంగంలోకి దించింది.
హర్యానా అంబాలాలోని శంభు సరిహద్దు, జింద్‌లోని ఖానౌరీ సరిహద్దుల వద్ద పటిష్టతను పెంచుతూ అదనపు పోలీసు బలగాలను మోహరించింది. పంజాబ్‌కు ఆనుకుని ఉన్న జింద్‌లోని డేటా సింగ్‌వాలా సరిహద్దు, సిర్సాలోని దబ్వాలీ, కురుక్షేత్రలోని పెహోవాను ఆనుకుని ఉన్న తుకర్ సరిహద్దు వద్ద నిఘా పెంచారు. మరోవైపు, ఢిల్లీ పోలీసులు హర్యానాకు ఆనుకుని ఉన్న తిక్రీ సరిహద్దును అర్థరాత్రి మూసివేశారు. ఇనుప బారికేడ్లు, సిమెంట్ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
హర్యానా హోంశాఖ కార్యదర్శి డాక్టర్ సుమితా మిశ్రా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు తమ అభిప్రాయాలను తెలియజేయాలని రైతు నేతలకు పిలుపునిచ్చారు. కమిటీ నివేదిక ఆధారంగానే తదుపరి విధానం రూపొందించారు. ఢిల్లీలో రైతుల నిరసనలకు అనుమతి లేకపోవడంతో వారిని అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే తమ డిమాండ్ల సాధన కోసం 100 మంది రైతులు శుక్రవారం ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.