India: చమురు దిగుమతులపై భారత్‌ ముందడుగు.. రష్యా డిస్కౌంట్‌ ఆఫర్‌కు...

India: రష్యా ముడి చమురును భారత్‌ కొనుగోలు చేస్తే ఉక్రెయిన్‌పై దురాక్రమణకు మద్ధతు ఇస్తున్నట్టేనని అమెరికా హెచ్చరించింది...

Update: 2022-03-17 05:30 GMT

చమురు దిగుమతులపై భారత్‌ కీలక నిర్ణయం

India: అంతర్జాతీయ ముడి చమురు చిచ్చులో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా ముడి చమురును భారత్‌ కొనుగోలు చేస్తే ఉక్రెయిన్‌పై దురాక్రమణకు మద్ధతు ఇస్తున్నట్టేనని అమెరికా హెచ్చరించింది. మరోవైపు దేశంలో పెట్రోలు ధరల పెరుగుదలను నియంత్రించాలంటే గత్యంతరంలేని పరస్థితి ఈ నేపథ్యంలో భారత్‌ అమెరికా హెచ్చరికలను పక్కన పెట్టింది. చమురు కొనుగోలు విషయంలో ముందడుగు వేసింది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సరఫరాదారు రష్యా నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఏకంగా క్రూడాయిల్‌ బ్యారల్‌ ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో అమెరికా సహా కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే, స్పెయిన్‌ వంటి దేశాల్లో చమురు ధరలు 50శాతం పైగా పెరిగాయి. భారత్‌లోనూ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరల పెంపునకు మొగ్గుచూపలేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలతో రష్యా చమురు కొనుగోలుపై పలు దేశాలు సందిగ్ధంలో పడ్డాయి.

ఆంక్షల ప్రభావం నేపథ్యంలో రష్యా సైతం పునరాలోచనల్లో పడింది. చమురు దిగుమతి దేశాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చమురు ధరల్లో డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించింది. అయితే చమురు కొనుగోలు విషయంలో భారత్‌ పునరాలోచించుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. రష్యా నుంచి క్రూడాయిల్‌ కొనుగోలు చేయడమంటే.. ఉక్రెయిన్‌పై దురాక్రమణను సమర్థించినట్టేనని మద్దతు ఇచ్చినట్టేనని హెచ్చరించింది. దీంతో విధ్వంసకర ప్రభావం ఉంటుందని తెలిపింది. రష్యాపై విధించిన ఆంక్షలను తప్పకుండా పాటించాలని ప్రపంచ దేశాలకు అమెరికా పిలుపునిస్తోంది.

అయితే భారత్‌ మాత్రం రష్యా ఆఫర్‌కు అనుకూలంగా స్పందించింది. క్రూడాయిల్‌ విషయంలో ముందుకే వెళ్లాలని భారత్‌, రష్యా నిర్ణయించాయి. ఆమేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. డిస్కౌంట్‌ ధరతో రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారత్‌ సిద్ధమైంది. త్వరలో 3.5 మిలియన్‌ బ్యారెళ్ల క్రూడాయిల్‌ త్వరలో భారత్‌కు రష్యా పంపనున్నది. భారత్‌కు చమురు రవాణాతో పాటు బీమాకు సంబంధించిన అన్ని అంశాల విషయంలో రష్యా జాగ్రత్తలు తీసుకోనున్నది. చెల్లింపుల విషయంలో మాత్రం స్పస్టత రాలేదు. కానీ... రూపాయి-రూబెల్‌ మారకం పద్ధతిలోనే చెల్లింపులకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

అయితే క్రూడాయల్‌ను డిస్కౌంట్‌ ఆఫర్ కింద భారత్‌ కొనుగోలు చేయడం ఆంక్షల ఉల్లంఘన కిందికి రాదని అమెరికానే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్‌, రష్యాలు ముందడుగు వేసినట్టు స్పష్టమవుతోంది. అయితే ఈ డీల్‌పై మాత్రం అగ్రరాజ్యం గుర్రుగానే ఉంది. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాజా డీల్‌పై అమెరికా, ఐరోపా దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News