Covaxin: కొవాగ్జిన్ టీకా తయారీకి అండగా నిలిచిన వానరాలు
* వానరాలే లేకపోతే లక్షల మంది ప్రాణాలు పోయే పరిస్థితి- ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్
Covaxin: కొవాగ్జిన్ రూపకల్పనలో భారత శాస్త్రవేత్తలకు వానరాలు అండగా నిలిచాయి. అవే లేకపోతే ఈ రోజు లక్షల మంది ప్రాణాలు నిలిచేవి కావని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ చెప్పుకొచ్చారు. కొవాగ్జిన్ విజయగాథలో హీరోలు మనుషులు మాత్రమే కాదని, కోతులూ ఉన్నాయని తెలిపారు. వాటిని ఎంత పొగిడినా తక్కువేనన్నారు. రీసస్ జాతి వానరాలను పట్టుకోవడానికి శాస్త్రవేత్తలు పడిన తంటాలను ఎదురైన సవాళ్లను వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధనల్లో రీసస్ కోతులనే ఉపయోగిస్తారు. వీటిని చైనా నుంచి చాలా దేశాలు దిగుమతి చేసుకుంటాయి. కొవిడ్-19 సమయంలో ఆ దిగుమతులు ఆగిపోవడంతో కోతులను ఎక్కడి నుంచి తేవాలన్న ఆందోళన భారత శాస్త్రవేత్తల్లో మొదలైంది.
దీంతో ఎన్‌ఐవీ పరిశోధకులు దేశవ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలను, వివిధ సంస్థలను సంప్రదించారు. రోజుల తరబడి వేల కిలోమీటర్లు గాలించి చివరకు రీసస్ కోతులను నాగ్‌పుర్ దగ్గర గుర్తించామన్నారు తెలిపారు.
అయితే ఆ తర్వాత శాస్త్రవేత్తలకు ఇంకో పెద్ద సవాల్ ఎదురైంది. మనుషుల నుంచి సార్స్-కొవ్-2 సోకకుండా వాటిని రక్షించడం. కోతుల సంరక్షకులకు, పశువైద్యులకు, పారిశుద్ధ్య సిబ్బందికి ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
చివరకు కథ సుఖాంతమైందని, ప్రయోగాలు విజయవంతమయ్యాయని, అయితే ఈ ప్రయాణంలో కోతులు పోషించిన పాత్రను ఎంత ప్రశంసించినా తక్కువనేని పేర్కొన్నారు.