Ratan Tata: రతన్ టాటా అంటే అందరికీ ఎందుకంత ఇష్టం? వ్యాపార రంగంలో అంతటి గౌరవం ఆయనకే ఎలా సాధ్యమైంది?

Update: 2024-10-10 14:28 GMT

Ratan Tata News: వ్యాపారం అంటేనే లాభాపేక్షతో కూడుకున్న రంగం. వ్యాపారవేత్తలకు డబ్బు సంపాదించే వ్యాపార దృక్పథం తప్ప సమాజహితం ఉండదనే అభిప్రాయం ఉంది. కానీ రతన్ టాటా వేరు. ఆయనంటే అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం. స్వార్థం లేని గొప్ప మనిషనే గౌరవం. ఎంతో మంది వ్యాపారవేత్తలున్న భారతదేశంలో ఆయనకు మాత్రమే ఆ గౌరవం ఎలా దక్కింది? ఎవ్వరికీ దక్కని ఇమేజ్ ఆయనకే ఎందుకు సొంతమైంది?

వ్యాపారంలో రాణించే వారు డబ్బు, పేరు ఎంత సంపాదిస్తారో విమర్శలు, ఆరోపణలు కూడా అదేస్థాయిలో ఎదుర్కొంటూ ఉంటారు. వ్యాపారంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లు చాలా అరుదు. రతన్ టాటా మాత్రం భారత వ్యాపార రంగంలో అజాత శత్రువు. ఆరోపణలు, విమర్శలు, వివాదాలలో ఆయన పేరెక్కడా వినిపించదు. అంతేకాదు, తన కంపెనీలకు వచ్చే లాభాల్లో దాదాపు 60 శాతానికిపైగా ఛారిటీలకే ఖర్చు చేసిన గొప్ప మానవతావాది రతన్ టాటా. ఆయనంటే ప్రజలకు ఎందుకంత ఇష్టమంటే చెప్పడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.

100కి పైగా దేశాలకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం..

మనం ఇంట్లో తినే ఉప్పు నుండి గాల్లో ఎగిరే విమానం వరకు టాటా గ్రూప్ చేయని వ్యాపారం లేదు. దాదాపు వందకు పైగా దేశాల్లో రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. టాటా కమ్యూనికేషన్స్ లాంటివి ఏవో ఒకట్రెండు తప్ప.. చేసిన ప్రతీ వ్యాపారంలోనూ సక్సెస్సే. అయినప్పటికీ... కుబేరుల జాబితాలో చాలామంది కంటే వెనుకే ఉన్నారు. దానికి కారణం, వ్యాపారాల్లో ఆయన లాభాపేక్ష చూసుకోలేదు. తన కంపెనీ తయారు చేసే ఉత్పత్తులేవైనా.. వాటితో వచ్చే లాభంలో కొంత తగ్గినా పర్వాలేదు కానీ నాణ్యతలో మాత్రం రాజీపడొద్దనేదే ఆయన సిద్ధాంతం. అందుకే ఆయన జనానికి అంత చేరువయ్యారు. టాటా బ్రాండ్ అంటే ఒక నమ్మకం అనే పేరు సొంతం చేసుకున్నారు.

విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ సంపాదించిన సొమ్మును కూడా ఆయన వెనుకేసుకోలేదు. ఆ ఆదాయాన్ని కూడా ఛారిటీల రూపంలో, విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ రూపంలో, కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూపంలో.. ఇలా ఏదో ఓ రకంగా మళ్లీ జనం కోసం ఖర్చు చేశారు. అందుకే ఆయన సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్ అయ్యారు కానీ బిలియనీర్ల జాబితాలో టాప్ అవలేదు. అది ఆయన లక్ష్యం కూడా కాదు.

లగ్జరీ నేపథ్యం.. అయినా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్

రతన్ టాటా నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందే శ్రీమంతుల కుటుంబం వారిది. న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఐబిఎం లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలో గొప్ప ఉద్యోగ అవకాశం వచ్చింది. అయినప్పటికీ, ఆ అవకాశాన్ని కాదనుకుని కుటుంబానికి చెందిన బిజినెస్‌లోనే 1962 లో అప్రెంటిస్‌గా చాలా కింది స్థాయి నుండి కెరీర్ మొదలుపెట్టారు. టాటా గ్రూపులో అనేక సంస్థల్లో ఎంతో నిబద్ధతతో పనిచేశారు. సొంత కంపెనీయే అయినప్పటికీ.. అప్రెంటిస్ నుండి డైరెక్టర్ బాధ్యతలు తీసుకోవడానికి ముందు తొమ్మిదేళ్లు కష్టపడ్డారు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి తొలిసారిగా డైరెక్టర్ అయ్యారు. సొంత కంపెనీలోనే పనిచేస్తున్నప్పటికీ.. తన డబ్బూ, స్థాయీ, హోదా, పలుకుబడిని ఏనాడూ ప్రదర్శించుకోలేదు.

రతన్ టాటా అంటేనే రిస్క్ టేకర్

మన దేశంలో ఢిల్లీ నుండి గల్లీ వరకు ఏ వీధికెళ్లినా.. టాటా ఉత్పత్తి లేని ఇల్లుండదు.. టాటా ఉత్పత్తి వాడని మనిషుండరు. టాటా వ్యాపార సామ్రాజ్యంలోనే మనం నిత్యం బతుకుతున్నామా అనిపించేంతలా ఒక వ్యాపార ప్రపంచాన్నే సృష్టించారు. 1991 లో జేఆర్డీ టాటా నుండి టాటా సన్స్, టాటా ట్రస్టులకు చైర్మన్ బాధ్యతలు అందుకున్నారు. ఆ తరువాతే ప్రపంచంలోనే పేరున్న కంపెనీలైన టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రున్నర్ మాండ్, జనరల్ కెమికల్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, డేవూ లాంటి కంపెనీలను కొనుగోలు చేసి టాటా గ్రూప్ కంపెనీల్లో కలిపేసుకున్నారు.

రతన్ టాటా ధైర్యం చేసి వేసిన ఆ అడుగులే టాటా గ్రూప్ వ్యాపారాన్ని ప్రపంచదేశాలకు విస్తరించేలా చేసింది. ఇవాళ ఎన్నో దేశాల్లో టాటా కంపెనీకి ఫైవ్ స్టార్ హోటల్స్, కెమికల్ కంపెనీలు, టెలికాం నెట్‌వర్క్స్, ఎనర్జి సెక్టార్‌లో వ్యాపారాలున్నాయి. వాటి విలువెంతంటే కచ్చితంగా చెప్పడం కూడా కష్టమే.

స్టార్టప్ బిజినెస్‌లకు బలం రతన్ టాటా విజనరీ

రతన్ టాటాకు డబ్బు సంపాదించాలనే వ్యాపార దృక్పథం లేదు కానీ వ్యాపారంలో ఎంతో ముందుచూపు మాత్రం ఉంది. ఏ బిజినెస్ ఎలా సక్సెస్ అవుతుందో అంచనా వేయడంలో ఆయన విజన్ తరువాతే ఎవరైనా. కంపెనీలను కొనుగోలు చేసి టాటాలో కలిపేసుకోవడమే కాదు.. బయటినుండే స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి వారికి ఆర్థికంగా బలమైన సపోర్ట్ ఇవ్వడంలోనూ టాటా తరువాతే ఎవరైనా. లెన్‌స్కార్ట్, పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ అప్‌స్టాక్స్.. ఇలా దాదాపు 50 స్టార్టప్ కంపెనీలకు ఊతమిచ్చిన మొనగాడు రతన్ టాటా.

అందుకే ఎయిర్ ఇండియాను టేకోవర్ చేశారా?

ఎయిర్ ఇండియా కంపెనీని ముందుగా టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించింది ఒకప్పటి చైర్మన్ జహంగీర్ రతన్‌జీ దాదాబాయ్ టాటా. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1953 లో ఇది భారత ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లి ఎయిర్ ఇండియాగా మారింది. కానీ, నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను 2022 జనవరిలో మళ్లీ రతన్ టాటా కొనుగోలు చేసి మళ్లీ తన పూర్వీకుల కంపెనీని తానే సొంతం చేసుకున్నారు.

స్వతహాగానే విలువలతో కూడిన జీవితం, ఎవ్వరినీ నొప్పించని మనస్తత్వం, మనిషిని మనిషిగా చూడని ఈ రోజుల్లో మానవత్వానికి మాత్రమే పెద్దపీట వేసే గొప్ప వ్యక్తిత్వం.. కళ్లముందున్న మనిషిని కాకుండా వారిలోని టాలెంట్‌ని మాత్రమే గుర్తించే నైపుణ్యం... ఇవన్నీ రతన్ టాటాను మిగతావారికంటే ప్రత్యేకం చేస్తాయి.

ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ.. ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ. ఏనాడూ ఆయన హంగూ ఆర్బాటాల జోలికి వెళ్లలేదు. చివరి వరకు అదే హుందాతనం.. అదే సింప్లిసిటీ. అందుకే వ్యక్తిత్వంలో ఆయనొక మహోన్నత శిఖరమయ్యారు. మతాలు, కులాలకు అతీతంగా అందరి మనసుల్లో ఎనలేని అభిమానం సంపాదించుకున్నారు.

Tags:    

Similar News