ఉద్రిక్తంగా మారిన రైతుల ఛలో ఢిల్లీ.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్..
హర్యానా రైతుల చలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఓ వైపు పోలీసు బందోబస్తు మరోవైపు రైతు నిరసనలతో వాతావరణం వేడెక్కింది. రైతులను అడ్డుకునేందుకు బోర్డర్‌లో భారీగా మోహరించిన పోలీసులు రైతులు వెనక్కి వెళ్లకపోవటంతో వాటర్ కెనాన్స్ ప్రయోగించారు.
దేశంలో వ్యవసాయ చట్టాలపై ఆగ్రహజ్వాలలు ఆరటం లేదు. పంజాబ్, హర్యానాల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం విధానాలపై మండిపడుతోన్న రైతులు నిరసనలు తెలిపేందుకు ఢిల్లీకి బయలుదేరారు. ఐదు హైవేల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్నారు. నిన్న సాయంత్రానికే పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ బోర్డర్‌కు చేరుకున్న రైతులు ఢిల్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారు.
అయితే రైతు సంఘాల పిలుపుతో అలర్ట్ అయిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునేందుకు బందోబస్తు ఉంచారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు ఎంత అడ్డుకున్నా రైతులు వినకపోవటంతో వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా వెనక్కి తగ్గని రైతులు బారికేడ్లు తొలగించి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఢిల్లీ-హర్యానా బోర్డర్ రణరంగంగా మారింది.
అటు పంజాబ్ రైతులు హర్యానాకు చేరుకోవటంతో పంజాబ్-హర్యానా బోర్డర్‌లో కూడా ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. రైతుల నిరసనలు అడ్డుకునేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.