రాజ్యసభ నుంచి 8 మంది ఎంపీల సస్పెన్షన్

రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. నిన్న సభలో జరిగిన ఘటనపై తీవ్ర అసహనంతో ఉన్నారు వెంకయ్యనాయుడు..

Update: 2020-09-21 04:56 GMT

రాజ్యసభలో రగడ సృష్టించిన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. 8 మంది ఎంపీలను వారంపాటు సస్పెండ్ చేశారు.. డెరెక్ ఓబ్రెయిన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రాగేష్,రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్ ఎలామరన్ కరీం లను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. నిన్న సభలో జరిగిన ఘటనపై తీవ్ర అసహనంతో ఉన్నారు వెంకయ్యనాయుడు.. ఈ ఘటనపై తన నివాసంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంష్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషితో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రగడ సృష్టించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రూల్ 256 ప్రకారం సభ్యుల సస్పెన్షన్‌ కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఇవాళ తీర్మానం ప్రవేశపెట్టారు. వీడియో ఫుటేజ్ పరిశీలించిన అనంతరం బాధ్యులైన ఎంపీలపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేయడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజ్యసభ కార్యకలాపాలను 30 నిమిషాలపాటు వాయిదా వేశారు చైర్మన్. కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరెక్ ఓబ్రియన్, కాంగ్రెస్ ఎంపి రిపున్ బోరా, ఆప్ ఎంపి సంజయ్ సింగ్, డిఎంకె ఎంపి తిరుచి శివ డిప్యూటీ చైర్మన్ పోడియం మీదకు ఎక్కి మైక్ ను లాక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. పలువురు ఎంపీలు కుర్చీ దగ్గరకు వచ్చి డిప్యూటీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, కాగితాలను చించివేశారు. ఆందోళనల మధ్య, రాజ్యసభ 10 నిమిషాలు వాయిదా పడింది, అనంతరం సభ తిరిగి ప్రారంభమై.. వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. మరోవైపు డిప్యూటీ ఛైర్మన్‌పై 12 విపక్ష పార్టీలు అవిశ్వాస నోటీసు ఇచ్చాయి.   

Tags:    

Similar News