Bharat Jodo Yatra: 20వ రోజుకు చేరిన భారత్‌ జోడో యాత్ర.. మలప్పురం జిల్లాలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర

Bharat Jodo Yatra: బడా వ్యాపారులపై మోడీకి ఉన్న ప్రేమ.. రైతులపై లేదని రాహుల్‌ విమర్శలు

Update: 2022-09-27 13:00 GMT

Bharat Jodo Yatra: 20వ రోజుకు చేరిన భారత్‌ జోడో యాత్ర.. మలప్పురం జిల్లాలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర

Bharat Jodo Yatra: బీజేపీ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బడా పారిశ్రామిక వేత్తలకు చెందిన కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తోందని రైతులు రుణాలను చెల్లింకపోతే మాత్రం ఎగవేతదారులుగా ప్రకటించి జైల్లో పెడుతున్నట్టు ఆరోపించారు. బీజేపీకి రైతుల కంటే బడా వ్యాపారులే ముఖ్యమా? అంటూ రాహుల్‌ ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా 20వ రోజు కేరళలోని మలప్పురం జిల్లాలోకి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రవేశించింది. మలప్పురంలో సాగుతున్న పాదయాత్రలో రైతులతో రాహుల్‌ ముచ్చటించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తుండడంతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆందోళన మొదలైందని రాహుల్‌ ఆరోపించారు.

20వ రోజు భారత్‌ జోడో యాత్ర మలప్పురం జిల్లాలోని పులమంతోల్‌ జంక్షన్‌లో ప్రారంభమైంది. మలప్పురం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా రాహుల్‌ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన ఈ యాత్ర 14 కిలోమీటర్ల మేర సాగింది. యాత్రలో పలువురు రైతులతో రాహుల్‌ గాంధీ ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శలు గుప్పించారు. రైతు రుణాలను మాఫీ చేయకుండా సాయం పేరుతో కంటి తుడుపు చర్యలతో సరి పెడుతోందని ఆరోపించారు. బడా వ్యాపారులపై ప్రధాని మోడీకి ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. మరోవైపు కేరళలో రాహుల్‌ యాత్రతో ట్రాఫిక్‌ స్తంభించిపోతోందంటూ వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.

సెప్టెంబరు 10న తమిళనాడు నుంచి కేరళలో ప్రవేశించిన ఈ యాత్ర అక్టోబరు 1న కర్ణాటకకు చేరనున్నది. 19 రోజుల వ్యవధిలో ఏడు జిల్లాల మీదుగా 450 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో భారత్‌ జోడో యాత్ర సాగనున్నది. అనంతరం రాహుల్‌ యాత్ర తెలంగాణలో కొనసాగనున్నది. అక్టోబరు 24న మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌లో తెలంగాణలో ప్రేవేశించి 366 కిలోమీటర్లమేర సాగనున్నది. మొత్తం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 9 అసెంబ్లీల్లో రాహుల్‌ యాత్ర సాగనున్నది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 150 రోజుల పాటు సాగనున్నది. ఈ యాత్ర మొత్తం 3వేల 570 కిలోమీటర్ల మేర సాగనున్నది.సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో జోడో యాత్రను రాహుల్‌ గాంధీ ప్రారంభించిన ఈ పాదయాత్ర జమ్మూ కశ్మీర్‌లో ముగుస్తుంది. 

Tags:    

Similar News