పంజాబ్ ఖైదీలకు శుభవార్త.. దేశంలోనే తొలిసారి ఈ విధానం అమలు
*జైళ్లలో జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడిపేందుకు అవకాశం
Punjab: పంజాబ్ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు భగవంత్ మన్‌సింగ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖైదీల్లో మార్పులు తెచ్చేందుకు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. జైళ్లలో ఏళ్లుగా గడుపుతున్న తమను చూసేందుకు వచ్చే భాగస్వామితో కొన్ని గంటలపాటు ఏకాంతంగా గడిపేందుకు వీలు కల్పించేందుకు సంకల్పించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. జైళ్లలో ఇలాంటి వసతిని దేశంలోనే తొలిసారి పంజాబ్ అమలుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం జైళ్లలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తున్నట్టు పంజాబ్ జైళ్ల శాఖ ప్రకటించింది. ముఖ్యంగా రెండు గంటల పాటు ఈ ఏకాంతానికి సమయం కేటాయిస్తున్నట్టు తెలిపారు. సుధీర్ఘకాలం జైలు జీవితం అనుభవిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపింది.
అయితే షరతులు వర్తిసాయని పంజాబ్ జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ఇది అందరికీ వర్తించదని స్పష్టం చేసింది. సత్ర్పవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లకు, అధిక ముప్పు ఉన్న ఖైదీలు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి మాత్రం ఈ సౌకర్యం కల్పించేది లేదని పంజాబ్ జైళ్ల శాఖ వెల్లడించింది. అయితే మొదట ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా గోయింద్వాల్ సాహిబ్‌లో ఉన్న కేంద్ర కారాగారం, నబాలోని నూతన జిల్లా జైలుతో పాటు భరిండాలోని మహిళా జైలులో అమలు చేయనున్నట్టు వివరించింది. ఈ విధానంతో వైవాహిక బంధాన్ని బలోపేతం చేయడంతో పాటు ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇలా తమ భాగస్వామితో ఏకాంతంగా గడపాలనుకునేవారు.. వివాహ ధ్రువపత్రంతో రావాల్సి ఉంటుంది. ఇదే కాదు.. ఖైదీని ఏకాంతంగా కలవడానికి వచ్చే ముందు కోవిడ్, లైంగిక సంబంధ, ఇతర అంటు వ్యాధులు లేవని కూడా ధ్రువీకరణ పత్రం వైద్యుడి నుంచి తేవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. గర్భం ధరించేందుకు అవకాశం కల్పించాలంటూ రాజస్థాన్‌కు చెందిన ఓ ఖైదీ భార్య జోథ్‌పూర్ కోర్టును ఆశ్రయించింది. భర్త జైలులో ఉంటే.. అతడి భార్య లైంగిక, భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటోందని.. ఆమె మాతృత్వ మధురిమలను అనుభవించాలనుకోవడం తప్పుకాదంటూ జోథ్‌పూర్ కోర్టు వ్యాఖ్యానించింది. సదరు ఖైదీకి 15 రోజుల పేరోల్ ఇస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పునిచ్చింది. తాజాగా పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అందుకు అనుకూలంగా ఉండడం విశేషం.