ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం... వయనాడ్‌లో పోటీకి సిద్ధం?

Wayanad: కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పోటీకి సిద్ధమయ్యారు. ఆమె రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగనున్నారు.

Update: 2024-06-14 07:26 GMT

Rahul Gandhi: వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్‌.. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ..?

Wayanad: ప్రియాంక గాంధీ వద్రా ఎన్నికల బరిలోకి తొలి అడుగు వేయడానికి సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్ వర్గాలు దీనికి అవుననే బదులిస్తున్నాయి. రాయబరేలి, వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గాలలో విజయం సాధించిన రాహుల్ గాంధీ ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం కావాల్సి ఉంటుంది. గతంలో వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ ఈసారి రాయబరేలి నియోజకవర్గాన్ని ఎంచుకుంటారని తెలుస్తోంది. అప్పుడు వయనాడ్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారనే టాక్ బలంగా వినపిస్తోంది.

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రాయబరేలి, వయనాడ్ పార్లమెంటు స్థానాల నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు చోట్లా ఆయనకు మూడున్నర లక్షల ఆధిక్యం లభించింది. ఆ విధంగా ఉత్తర, దక్షిణ భారత ప్రజలు ఆయనను బీజేపీకి బలమైన ప్రతిపక్ష నేతగా నిలబెట్టారు.

రాహుల్ రెండు స్థానాల్లో కొనసాగకూడదా?

భారతదేశంలో ఎవరైనా ఒకటికి మించిన స్థానాల్లో పోటీ చేయవచ్చు. కానీ, ఫలితాలు వెలువడిన తరువాత ఒకటి కన్నా ఎక్కువ స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఏదో ఒకటి ఎంచుకోవాలని నిబంధనలు సూచిస్తున్నాయి. రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఫలితాలు వెలువడిన 14 రోజుల్లోగా ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాలి. లేదంటే, ఆ రెండు స్థానాలూ ఖాళీ అయినట్లుగా పరిగణించి రెండింటికీ మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు.

2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వచ్చాయి. అంటే, రాహుల్ గాంధీ జూన్ 18 లోగా ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. ఆ తరువాత ఖాలీ అయ్యే వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి మొదటిసారిగా దిగుతారని భావిస్తున్నారు.

క్లూ ఇచ్చిన కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్

రాహుల్ గాంధీ ఏ నియోకవర్గాన్ని ఎంచుకుంటారనే విషయంపై చర్చ జరుగుతున్న సందర్భంలో కేరళ కాంగ్రెస్ కమిటీ – కేపీసీసీ చీఫ్ కె. సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త ఊహాగానాలకు తెర తీశాయి. ఆయన ఇటీవల ఒక సభలో వయనాడ్ స్థానం ఖాళీ అవుతుందని సూచన ప్రాయంగా తెలిపారు.

“రాహుల్ గాంధీ వంటి దేశ నాయకుడు వయనాడ్‌లోనే ఉండాలని మనం ఆశించకూడదు. దానికి మనం బాధపడకూడదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మనం మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలి” అని సుధాకరన్ అన్నారు.

రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ఫలితాల అనంతరం వయనాడ్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఏ నియోజకవర్గం ఎంచుకోవాలన్నది తానూ తేల్చుకోలేకపోతున్నానని చెప్పారు. “డోంట్ వరీ.. నేను తీసుకునే నిర్ణయం రాయబరేలీ, వయనాడ్ రెండు ప్రాంతాల ప్రజలకూ సంతోషకరంగా ఉంటుంది” అని రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాదు, వయనాడ్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రియాంక తమ బాగోగులు చూసుకోవాలని రాసి ఉన్న పోస్టర్లను ఇప్పటికే అంటించారు.

ఈ పరిణామాలన్నీ ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం ఖాయమని చెప్పకనే చెబుతున్నాయి.

Tags:    

Similar News