Trichy Airport: తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో హై టెన్షన్.. విమానంలో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Flight Emergency Landing At Trichy Airport: తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్ పోర్టులో హై టెన్షన్ వాతావరణం నెలకుంది. తిరుచ్చి విమానాశ్రయం నుండి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో సిబ్బంది కాకుండా 141 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. దీంతో మళ్లీ తిరుచ్చి విమానాశ్రయానికే వస్తున్నట్లుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించిన పైలట్, అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు.
పైలట్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన తిరుచ్చి ఎయిర్ పోర్ట్ అధికారులు.. హుటాహుటిన విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల సహాయం కోసం ముందు జాగ్రత్తగా 20 ఫైర్ ఇంజన్స్, మరో 20 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.
ఎట్టకేలకు కొద్దిసేపట్లోనే తిరుచ్చి విమానాశ్రయానికి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం సాధారణంగానే ల్యాండ్ అవడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతకంటే ముందుగా చోటుచేసుకున్న ఈ మొత్తం పరిణామంతో తిరుచ్చి ఎయిర్ పోర్టులో హై టెన్షన్ వాతావరణం నెలకుంది.