కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న మూడు ప్రముఖ సంస్థలను శనివారం ప్రధాని మోడీ స్వయంగా సందర్శించనున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ మూడు సంస్థలనూ ఒకేరోజు ప్రధాని సందర్శించనుండటం ప్రాధాన్యత సంతరించకుంది. భారత్‌లో కరోనా టీకాలను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్, సీరం, జైడస్ క్యాడిలా సంస్థలను ప్రధాని మోడీ సందర్శిస్తారు. మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ పర్యటన తరువాత మోడీ కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని దేశ ప్రజలు భావిస్తున్నారు.
ప్రధాని పర్యటన ఇలా..
గుజరాత్ లోని జైడస్ నుంచి మొదలు..
ప్రధాని మొదట గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా సంస్థను సందర్శిస్తారు. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న 'జైకోవ్-డి' టీకా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది. తరువాత మోడీ పుణె చేరుకుంటారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు. టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, పంపిణీకీ సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీస్తారు. సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇక్కడ నుంచి నేరుగా ప్రధాని హైదరాబాద్ వస్తారు. హకీంపేట వైమానిక స్థావరానికి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం సుమారు 12.55కి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి నగరశివార్లలోని జినోమ్‌వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు. ఈ సంస్థ 'కొవాగ్జిన్' పేరుతో టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మూడో దశ క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయి. మోదీ ఆ సంస్థలో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు. అక్కడాయన సుమారు గంటసేపు గడుపుతారు. తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
ఒకే రోజు ప్రధాని మూడు కీలక ప్రదేశాలను సందర్శించనుండటం విశేషం.