Uttar Pradesh: యూపీలో ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ అరాచకం
Uttar Pradesh: టాయిలెట్లను చిన్నారులతో శుభ్రం చేయించిన వైనం
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ అరాచకానికి పాల్పడ్డాడు. కనీసం 10 ఏళ్లు కూడా నిండని చిన్నారులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించాడు. ఈ సంఘటన యూపీలోని బలియా జిల్లా పిప్రా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది. స్కూల్‌లోని టాయిలెట్లను శుభ్రం చేయాలంటూ చిన్నారులు ప్రిన్సిపల్ ఆదేశించారు. పక్కనే నిలబడి.. పిల్లల చేత టాయిలెట్లను కడిగించారు. అంతేకాదు మరుగుదొడ్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే.. తాళం వేస్తానని.. అప్పుడు ఇంటికి వెళ్లాల్సి వస్తుందని బెదిరించాడు. ఈ వ్యవహారాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో విద్యార్థులతో టాయిలెట్లను శభ్రం చేయించడం స్పష్టంగా కనిపిస్తోంది.
చిన్నారుల మరుగుదొడ్లను శుభ్రం చేసే వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రిన్సిపాల్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తిన్న తరువాత చేయి కూడా కడుక్కోవడానికి రాని చిన్నారులతో ఇలాంటి పనులు చేయించడమేమిటంటూ మండిపడుతున్నారు. వెంటనే సదరు ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు బలియా జిల్లా విద్యాశాఖ అధికారి అఖిలేష్ కుమార్ ఝా తెలిపారు. విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన పిప్రా పాఠశాల ప్రిన్సిపాల్‌ఫై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖాధికారి స్పష్టం చేశారు.