PM KISAN 2024 October: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ.. ఎలా చెక్ చేసుకోవాలంటే..
PM KISAN 2024 October Installment: పీఎం కిసాన్ పథకంలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ 18వ ఇన్‌స్టాల్మెంట్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి నుండే పిఎం కిసాన్ పథకం డబ్బులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకు రూ. 2,000 చొప్పున కేంద్రం తరపున ఆర్థిక సాయం జమ కానుంది. ఈ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం కేంద్రం రూ. 20 వేల కోట్ల నిధి కేటాయించింది.
దేశవ్యాప్తంగా సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో 2018లో ఎన్డీఏ సర్కారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతీ సంవత్సరం సన్నకారు రైతులకు ఏడాదిలో ఒక్కో విడతకు రూ. 2,000 చొప్పున మొత్తం మూడు విడతల కింద రూ. 6 వేల ఆర్థిక సహాయం అందించడం ఈ పిఎం కిసాన్ పథకం ముఖ్య ఉద్దేశం.
పిఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 17 విడతల్లో ఆర్థిక సాయం అందించారు. నేటితో రైతుల ఖాతాల్లో 18వ విడత పెట్టుబడి సాయం డబ్బులు జమ అవడం మొదలైంది.
చివరిసారిగా జూన్ 18న 9.25 కోట్ల మంది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ 17వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ అయింది. అప్పటికి, ఇప్పటికి కొత్తగా మరో 25 లక్షల మంది రైతుల పేర్లు నమోదయ్యాయి.
లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలా?
పిఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లోకి వెళ్లి కింది భాగంలో ఉన్న బెనిఫిషియరి లిస్ట్ అనే బటన్ నొక్కాలి.
ఆ తరువాత ఈ కింద డిస్‌ప్లే అయిన విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రం, జిల్లా, రెవిన్యూ డివిజన్, గ్రామం వంటి వివరాలు ఇచ్చి ఆ పక్కనే ఉన్న గెట్ రిపోర్ట్ అనే బటన్ నొక్కాలి.
ఇక్కడ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ పేరు ఇంకా నమోదు చేసుకోనట్లయితే.. వెబ్‌సైట్ హోంపేజీలోనే 'న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్' పేరిట మరొక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కి అందులో మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, తదితర వివరాలు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీ పేరు నమోదు చేసుకున్న తరువాత కూడా e-KYC ప్రక్రియ పూర్తి కానట్లయితే, మీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉండవు. అందుకే అదే పేజీలో ఉన్న e-KYC అనే బటన్ నొక్కి ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత బెనిఫిషియరి స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది.