మమతా బెనర్జీ ర్యాలీ తర్వాత ప్రధాని మోడీ కొల్ కతా చేరుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బెంగాల్ లో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ కోల్ కతా పర్యటించారు. నేతాజీ భవన్ లో నేతాజీకి ఘన నివాళి అర్పించారు. ఆ తర్వాత నేతాజీ మ్యూజియంను ప్రధాని ప్రారంభించారు. కొల్ కతాలోని నేషనల్ లైబ్రరీలో అంతర్జాతీయ డిలిగేట్లు, కళాకారులను ప్రధాని కలుసుకున్నారు. విక్టోరియా మెమోరియల్‌ను సందర్శించారు. మోడీ వెంట గవర్నర్ జగదీప్ ధన్‌కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు.
మరోవైపు బెంగాల్ ఇప్పటికే ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతోంది. బీజేపీ, టీఎంసీ పార్టీలు పోటీలు పడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జనవరి 23న నేతాజి జయంతిని 'పరాక్రమ్ దివస్'గా జరపాలని ఇటీవలే కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బెంగాల్ వ్యాప్తంగా భాజపా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బెంగాల్ లో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కోల్ కతాకు వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ప్రధాని మోడీ అసోంలో ఆగారు. అసోంలో కూడా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అసోంలోని స్థానికులకు ఆయన భూమి కేటాయింపుల పత్రాలను అందజేశారు.