వజ్రాల వ్యాపారి కుమారుడి పెళ్లికి హాజరైన ప్రధాని మోడీ.. ఎవరీ సావ్జీ ఢోలాకియా?

Savji Dholakia: ప్రధాని మోడీ గుజరాత్ లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట జరిగిన పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

Update: 2024-10-31 06:48 GMT

వజ్రాల వ్యాపారి కుమారుడి పెళ్లికి హాజరైన ప్రధాని మోడీ.. ఎవరీ సావ్జీ ఢోలాకియా?

Savji Dholakia: ప్రధాని మోడీ గుజరాత్ లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట జరిగిన పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో పెళ్లికి హాజరైన మోడీ నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఏకంగా మోడీ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారంటే ఆ వ్యాపారి ఎవరు..? అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా, జాన్వి ఒక్కటైన సందర్భంగా మోడీ హాజరై వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుజరాత్ అమ్రేలి జిల్లా దుధాలా గ్రామంలో 1962 ఏప్రిల్ 12న సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సావ్జీ ఢోలాకియా పెద్ద వజ్రాల వ్యాపరిగా ఎదిగారు. అయితే చిన్నతనం నుంచి చదువు సరిగా రాకపోవడంతో 4వ తరగతిలోనే చదువు ఆపేశారు. ఆ సమయంలో తన మేనమామ దగ్గర వజ్రాల పాలిషింగ్ వర్క్ నేర్చుకుని వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు.

బిజినెస్ ప్రారంభించిన తర్వాత సావ్జీ వెనక్కి తిరిగి చూడలేదు. అయితే ఈ తరహాలో వ్యాపారాలు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ తాను సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి సమాజానికి ఇచ్చేయాలని భావించారు సావ్జీ. ఆయనకు ఉన్న ఆ మంచి లక్షణమే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. వ్యాపారంలో భారీగా లాభాలు రావడంతో తాను సంపాదించిన ఆదాయంలో కొంత దాన ధర్మాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాను సంపాదించిన దాంట్లో నుంచి ప్రతి ఏడాది తన దగ్గర పనిచేసే సిబ్బంది కోసం కోట్లాది రూపాయలను కానుకలుగా అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2011లో దీపావళి కానుకగా తన సిబ్బందికి ఖరీదైన బహుమతులు, బోనస్ లు అందించారు సాన్జీ. దీంతో తొలిసారిగా ఆయన వార్తల్లో నిలిచారు.

ఆ తర్వాత 2015లో తమ సిబ్బందికి 491 కార్లు.. 2 వందలకు పైగా ఫ్లాట్లను గిఫ్టులుగా ఇచ్చారు. 2018లో ఏకంగా 15 వందల మంది ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు అందించారు. ఇందులో 6 వందల మందికి కార్లు, 9 వందల మందికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. వీటిని ప్రధాని మోడీ చేతుల మీదుగా అందించడం మరో విశేషం. దీంతో సావ్జీ ఢోలాకియా పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. అంతేకాకుండా పేద యువతులకు వివాహాలు చేయడం, విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయడం వంటివి కూడా చేస్తుంటారు. ఆయన సేవలకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో అభినందించింది. తాజాగా సావ్జీ కొడుకు పెళ్లికి మోడీ హాజరవ్వడంతో ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.


Tags:    

Similar News