ముగిసిన అఖిలపక్ష సమావేశం.. ప్రశ్నలు సంధించిన సోనియా
చైనాతో ఉద్రిక్తత, లద్ధాక్ లోని గాల్వన్‌లో 20 మంది భారతీయ సైనికుల అమరవీరుల అంశంపై ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అఖిలపక్షం నేతలకు ప్రస్తుత పరిస్థితిని వివరించారు
చైనాతో ఉద్రిక్తత, లద్ధాక్ లోని గాల్వన్‌లో 20 మంది భారతీయ సైనికుల అమరవీరుల అంశంపై ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అఖిలపక్షం నేతలకు ప్రస్తుత పరిస్థితిని వివరించారు. రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఘర్షణకు ముందు.. ఆ తరువాత పరిస్థితిని వివరించారాయన. ఈ సందర్బంగా ఎలాంటి సవాళ్ళను అయినా ఎదుర్కొంటామని రాజ్ నాథ్ ప్రకటించారు. రాజ్ నాథ్ తరువాత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పార్టీల అధినేతలంతా తమ అభిప్రాయాలను వెలియబుచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధి పలు ప్రశ్నలు సంధించారు. జరిగిందేదో జరిగింది తరువాత ఏమి చెయ్యాలన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా అని ఆమె ప్రశ్నించారు. మే ఐదోతేదీన వార్తాకధనాల్లో పేర్కొన్నట్టుగా చైనా సైనికులు భారత భూభాగంలోకి అన్ని ఒప్పందాలను అతిక్రమించి చొరబడ్డారు లేక అంతకుముందే జరిగిందా ఈ అంశంపై ప్రభుత్వానికి ఏమైనా సమాచారం ఉందా? అని ప్రశ్నించారు అలాగే మే ఐదు నుంచి 6వ తేదీ వరకూ చైనాతో చర్చలు జరిపేంతవరకూ దాదాపు 30 రోజుల విలువైన కాలాన్ని వృధా చేసుకున్నామని ఆమె అన్నారు.
ఏది ఏమైనప్పటికి ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని వివిధ రాజకీయ పక్షాలు అంటూనే.. ఎప్పటికప్పుడు పరిస్థితులను అందరితో పంచుకొని తద్వారా దేశం మొత్తం ఒకతాటిమీద ఉందనే సంకేతాన్ని ప్రపంచానికి ఇవ్వాలని సూచించారు. ఇందులో దేశంలోని 20 పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో అమరవీరులైన సైనికులకు నివాళి అర్పించారు.