Toxic Links Report: మనం తినే ఉప్పులో, చక్కెరలో ప్రాణాలు తీసే ప్లాస్టిక్..!
ఐదు మిల్లీమీటర్ల నుండి ఒక మైక్రోమీటర్ వరకు ఉండే చిన్న ప్లాస్టిక్ ముక్కలను మైక్రోప్లాస్టిక్ గా పిలుస్తారు. ఇవి పెద్ద ప్లాస్టిక్ శకలాల నుంచి తయారవుతాయి.
మీ పేస్ట్ లో ఉప్పుందా… అని ఒక పాపులర్ యాడ్ మీలో చాలా మంది చూసే ఉంటారు. కానీ, ఇప్పుడు మీరు తినే ఉప్పులో ప్లాస్టిక్ ఉందని మీకు తెలుసా… అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. ఇది నిజం. మనం తినే ఉప్పులో, చక్కెరలో ప్లాస్టిక్ ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
టాక్సిక్స్ లింక్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న ఉప్పు, చక్కెర మీద పరిశోధనలు చేసింది. ఇటీవలే విడుదలైన ఈ రీసెర్చ్ రిపోర్టులోని కొన్ని విషయాలు ఎవరినైనా షాక్ గురి చేసేలా ఉన్నాయి. అయోడైజ్డ్ ఉప్పులోనే కాదు సాధారణ ప్యాకేజి ఉప్పులోనూ ప్లాస్టిక పదార్థాలు ఉన్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
టాక్సిక్స్ లింక్ రిపోర్ట్ లో ఇంకా ఏముంది?
పెద్ద బ్రాండ్స్, చిన్న కంపెనీలు అనే తేడా లేకుండా మార్కెట్లో లభిస్తున్న 10 రకాల ఉప్పు, 5 చక్కెర బ్రాండ్లను టాక్సిక్స్ లింక్ సంస్థ అధ్యయనం చేసింది. వాటన్నింటిలోనూ మైక్రోప్లాస్టిక్ ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. చైనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో మైక్రోప్లాస్టిక్ ను ఎలా లెక్కిస్తారో ఈ సంస్థ కూడా అదే పద్దతిని పాటించింది.
ఒక్క కిలో ఉప్పు, చక్కెరలలో 6.71 నుంచి 89.15 వరకు మైక్రోప్లాస్టిక్ ముక్కలను గుర్తించారు. ఇవి 0.1 నుంచి 0.3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నాయి. తెలుపు, నీలం, ఎరుపు, నలుపు రంగుల్లో మైక్రోప్లాస్టిక్ ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ తెలిపింది. కిలో అయోడైజ్డ్ ఉప్పులో 6.71 నుంచి 89.15 ప్లాస్టిక్ ముక్కలను గుర్తించారు. సాధారణ ఉప్పులో 6.70 ప్లాస్టిక్ ముక్కలున్నాయి.
మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి?
ఐదు మిల్లీమీటర్ల నుండి ఒక మైక్రోమీటర్ వరకు ఉండే చిన్న ప్లాస్టిక్ ముక్కలను మైక్రోప్లాస్టిక్ గా పిలుస్తారు. ఇవి పెద్ద ప్లాస్టిక్ శకలాల నుంచి తయారవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే పెద్ద ప్లాస్టిక్ ఉత్పత్తుల నుంచి రాలిన లేదా విడివడిన చిన్న చిన్న ముక్కలనే మైక్రోప్లాస్టిక్స్ అంటారు.
ఇవి వాతావరణంలో సులభంగా కలుస్తున్నాయి. కొన్ని మరీ చిన్నగా రేణువుల్లా ఉంటున్నాయి. మైక్రో ప్లాస్టిక్ కంటే ఇంకా తక్కువ సైజులో ఉండే ఈ రేణువులను నానో ప్లాస్టిక్ గా పిలుస్తారు. మైక్రో ప్లాస్టిక్, నానోప్లాస్టిక్ సాధారణంగా కంటికి కనిపించవు. కానీ, వీటితో పర్యావరణానికి చాలా ప్రమాదం పొంచి ఉంది. మైక్రో, నానో ప్లాస్టిక్ లను కలిపి MNP గా పిలుస్తారు.
MNP లతో ఆరోగ్యానికి ప్రమాదం
ప్రపంచంలో ఎక్కడైనా MNPలు కన్పిస్తున్నాయి. సముద్ర అడుగుభాగంలో ఇవి ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు తేల్చాయి. సింథటిక్ ఫైబర్ లతో తయారు చేసిన దుస్తులు, లాండ్రీలు, వాహనాల టైర్లు, ఆహారం, ప్యాకేజీ వాటర్, సౌందర్య సాధనాలు, చర్మ సంరక్షణ, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా MNP ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.
సముద్రంలో ఉన్న మొత్తం MNP లో దాదాపు 35 శాతం దుస్తుల నుంచి వచ్చినవే. 20 మైక్రోమీటర్ల కంటే చిన్నగా ఉండే MNPలు అవయవాలలోకి చొచ్చుకుపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే 10 మైక్రోమీటర్ల కంటే చిన్నవి మెదడు, ప్లాసెంటాలోకి ప్రవేశిస్తాయి.
మైక్రోప్లాస్టిక్ శరీరంలో చేరితే గుండెపోటు, శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. హర్మోన్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మైక్రో ప్లాస్టిక్ ను పీల్చుకుంటున్న దుస్తులు
మనిషి జీవితంలో ప్లాస్టిక్ తో విడదీయరాని బంధం ఏర్పడింది. రోజువారీ జీవితం నుంచి ప్లాస్టిక్ ను పూర్తిగా తొలగించడం చాలా కష్టంగా మారింది. ప్లాస్టిక్ సీసాల్లో నిల్వ చేసిన నీటిలో మైక్రోప్లాస్టిక్ లు కలుస్తు్న్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నాన్ స్టిక్ పాన్ లలో వంటలు చేసే సమయంలో ఫిల్టర్ ఉప్పు వాడితే ఆ వంటలో మరిన్ని మైక్రోప్లాస్టిక్ లు చేరుతాయి.
మనం ధరించే బట్టలు, రోజువారీ ఉపయోగించే వస్తువులు మైక్రోప్లాస్టిక్‌లను పీల్చుకుంటాయి. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ చిన్న కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్ అంతా భూమిపైనే ఉండిపోయింది. దీంతో పండించే పంటల్లో కూడా ఇవి చేరుతున్నాయి.
ప్లాస్టిక్ వాడకం మనిషి జీవితంలో సాధారణమైంది. సౌకర్యవంతమైన జీవనం కోసం వాడుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని మరింత కలుషితం చేస్తోంది. భవిష్యత్తు తరాల ప్రయోజనాల కోసమైనా ఇప్పటినుంచే ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలి. ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రజలు తమవంతు సహకారం అందించాలి.