School Jobs Scam: మంత్రి పార్థాకు షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ..
School Jobs Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియమాకాల కుంభకోణంలో ఫస్ట్ వికెట్ పడింది.
School Jobs Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియమాకాల కుంభకోణంలో ఫస్ట్ వికెట్ పడింది. ఆ రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీపై వేటు పడింది. పార్థను మంత్రి పదవి నుంచి తప్పిస్తూ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈడీ దాడుల్లో కోట్లాది రూపాయలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. పార్థ ఛటర్జీకి సన్నిహితురాలిగా చెబుతున్న నటి అర్పిత ముఖర్జీ ఇంట్లో కోట్లాది రూపాయలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత 21 కోట్లకు పైగా నగదు, 56 లక్షలకు పైగా విదేశీ కరెన్సీ, 76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా దాడుల్లో మరోసారి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
అర్పితకు చెందిన రెండో ఫ్లాట్‌లో జరిగిన తనిఖీల్లో దాదాపు 29 కోట్ల నగదు, 5 కేజీలకు పైగా బంగారం, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును లెక్కించేందుకు ఎస్‌బీఐ అధికారులు కౌంటింగ్ మెషిన్లు తీసుకురావాల్సి వచ్చింది. అయితే స్వాధీనం చేసుకున్న సొమ్మును స్కామ్ ద్వారా కూడగట్టినదే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారంలో ఉన్న తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వంలో మూడో నెంబర్‌గా కొనసాగుతున్న మంత్రిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఎం మమత ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో పార్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే మంత్రివర్గం నుంచి పార్థను తప్పిస్తూ మమత నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి పార్థ, నటి అర్పితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్నారు. స్కామ్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ సాగుతోంది. మరోవైపు మంత్రిపై నటి అర్పిత సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పర్సనల్ గదిని మంత్రి మినీ బ్యాంక్‌గా వాడుకున్నారని ఆరోపించింది. ఎంత డబ్బు దాచాడో తనకు తెలియదని చెప్పుకొచ్చింది.