Oxygen Tanker Missing: మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్
Oxygen Tanker Missing: దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగిన నేపధ్యంలో హర్యానాలో ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం
Oxygen Tanker Missing: దేశంలో కరోనావైరస్ కోరలుచాస్తోంది. కరోనా వైరస్ మహా మహా దేశాల సత్తాకే సవాలు విసరుతోంది. ప్రస్తుతం శ్మశానవాటికలో చల్లారని చితిమంటలు కరోనా మారణ హోమానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఈ కల్లోలాన్ని ఎదుర్కోవడానికి భరత్ శతధా ప్రయత్నిస్తోంది. నిత్యం లాక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో చాలాచోట్ల ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో కరోనా బాధితులు, సాధారణ రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి కనపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో.. ఓ వైపు ఆక్సిజన్ కొరతతో ఆందోళన చెందుతుంటే.. మరోవైపు హర్యానాలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ట్యాంకర్ అదృశ్యం కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వివరాలు.. హర్యానాలోని పానిపట్ నుంచి సిర్సాకు ఆక్సిజన్ లోడుతో ఓ ట్యాంకర్ బయలుదేరింది. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పానిపట్ జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బుధవారం పానిపట్ ప్లాంట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ నింపుకున్న ట్యాంకర్ సిర్సాకు బయల్దేరి వెళ్లింది. అయితే ఆ వాహనం గమ్యస్థానానికి చేరకపోవడంతో సంబంధిత అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. ట్యాంకర్ మార్గంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఎవరైనా అడ్డుకున్నారా..? లేక డ్రైవరే దారి మళ్లించాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే దేశంలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగిన తరుణంలో ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.