కర్నాటకలో నెంబర్ గేమ్‌..స్పీకర్ ముందు 4 ఆప్షన్స్‌..

Update: 2019-07-09 12:20 GMT

కర్నాటకలో నెంబర్‌ గేమ్ నడుస్తోంది. బలగం పెంచుకోకుండానే సొంత బలంతోనే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కుదుపుతుంటే, అదే సమయంలో రెబల్స్‌‌ను బుజ్జగించి ఎలాగైనా సంకీర్ణ సర్కారును కాపాడుకునేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కర్నాటక తాజా సంక్షోభంలో ఎమ్మెల్యేల రాజీనామాలే కీలకంగా మారడంతో ఎపిసోడ్‌ మొత్తం స్పీకర్ చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయంపైనే కుమారస్వామి సర్కార్‌ ఉంటుందో లేక బీజేపీ అధికారంలోకి వస్తుందో నిర్ణయించనుంది.

కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌‌ను తగ్గించి, తన సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224మంది ఎమ్మెల్యేలు ఉండగా, గతేడాది జరిగిన ఎన్నికల్లో 105 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్పీ ఒకటి ఇండిపెండెంట్స్‌ రెండు స్థానాల్లో గెలుపొందారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113మంది సభ్యుల మ్యాజిక్‌ ఫిగర్ లేకపోయినా గవర్నర్ పిలుపుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా బలనిరూపణ చేసుకోలేక యడ్యూరప్ప రాజీనామా చేయాల్సివచ్చింది. అనంతరం కాంగ్రెస్‌, జేడీఎస్‌ జట్టుకట్టి 14నెలలుగా సంకీర్ణ గవర్నమెంట్‌ను నడుపుతున్నాయి. అయితే 13మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ సర్కార్ బలం 103కి పడిపోయి సంక్షోభంలో పడింది. అదే సమయంలో ఇద్దరు ఇండిపెండెంట్స్‌ మద్దతుతో బీజేపీ బలం 107కి పెరిగింది. ఒకవేళ 13మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే మ్యాజిక్‌ ఫిగర్ 106కి తగ్గతుంది. దాంతో సొంత బలంతోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇదంతా జరగాలంటే 13మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 13మందిపై అనర్హత వేటేసినా అది కాంగ్రెస్‌-జేడీఎస్‌కే నష్టం. ఈ లెక్కన చూసినా కాంగ్రెస్‌-జేడీఎస్‌ బలం 103కి పడిపోనుంది. అదే సమయంలో బీజేపీ బలం 107కి పెరగనుంది. ఎమ్మెల్యేల రాజీనామాతో కర్నాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 211కి పడిపోనుంది. దాంతో మ్యాజిక్ ఫిగర్ కూడా 106కి తగ్గనుంది. ఈ లెక్కన చూసినా బీజేపీకే రూట్‌ క్లియరవుతోంది.

మ్యాజిగ్ ఫిగర్ లేకపోయినా మొదట కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి చేతులు కాల్చుకున్న బీజేపీ ఆ తర్వాత ఆచితూచి అడుగులేస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి మ్యాజిక్‌ ఫిగర్‌‌కి కేవలం 9 సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కర్నాటక మొత్తం క్వీన్ స్వీప్ చేయడంతో తన వ్యూహాలకు మళ్లీ పదునుపెట్టింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బహిరంగ ప్రకటనలు సైతం చేసింది. అయితే అదనుచూసి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టుగా తాజా రాజకీయ సంక్షోభంతో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదిపింది. ఎందుకంటే, రాజీనామాచేసి సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్‌-జేడీఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే నగేష్ ఉన్నట్టుండి మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా, బీజేపీకి మద్దతు ప్రకటించడం వెనుక కమలనాథుల హస్తముందని కాంగ్రెస్‌-జేడీఎస్ ఆరోపిస్తున్నాయి.

ఒకవైపు రెబల్స్‌తో నెంబర్ గేమ్ ఆడిస్తూనే, మరోవైపు కుమారస్వామి తప్పుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మెజారిటీ కోల్పోయిన కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దారివ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలాగే రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలంటూ స్పీకర్‌ను బీజేపీ కోరింది. ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకుంటే, స్పీకర్‌‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

కర్నాటక సంక్షోభం మొత్తం స్పీకర్ చుట్టూనే తిరుగుతోంది. ఓవరాల్‌ ఎపిసోడ్‌లో స్పీకర్‌ నిర్ణయమే అత్యంత కీలకంగా మారింది. అయితే 13మంది రెబల్‌ ఎమ్మెల్యేల్లో 8మంది రాజీనామాలను స్పీకర్‌ తిరస్కరించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో లేకపోవడంతో ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఒక జేడీఎస్ ఎమ్మెల్యే రాజీనామాను రిజక్ట్‌ చేశారు. అలాగే మిగతా ఎమ్మెల్యేలను తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గవర్నర్‌ సూచన మేరకే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక అనర్హత వేటేసినా అది కాంగ్రెస్‌‌-జేడీఎస్‌కే నష్టం. ఎందుకంటే రెండింటిలో ఏది చేసినా ఇప్పటికిప్పుడు అసెంబ్లీలో బలాబలాలు మారిపోనున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్ బలం 103కి పడిపోనుంది. అదే సమయంలో బీజేపీ బలం 107కి పెరిగింది. అలాగే మ్యాజిక్ ఫిగర్ 106కి తగ్గిపోనుండటంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడగానికి మార్గం లైన్ క్లియరవుతుంది. దాంతో రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించి వారిని దారిలోకి తెచ్చుకోవడం ఒక్కటే కాంగ్రెస్‌-జేడీఎస్‌ ముందున్న మార్గంగా కనిపిస్తోంది.

కర్నాటక సంక్షోభంలో స్పీకర్ నిర్ణయమే కీలకంగా మారడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే స్పీకర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడం లేక రాజీనామాలపై నిర్ణయాన్ని ఆలస్యం చేయడం ఈ రెండూ కాకపోతే రెబల్స్‌‌పై అనర్హత వేటేయడం ఈ మూడూ కాకపోతే ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించడమే స్పీకర్ ముందున్న ఆప్షన్స్ అంటున్నారు. అయితే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలున్నా తిరస్కరిస్తే రెబల్స్‌ కోర్టుకెళ్లే అవకాశముంది. దాంతో స్పీకర్ వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. అంతేకాదు స్పీకర్ ఫార్మాట్‌లో లేవంటూ 8మంది ఎమ్మెల్యేల రాజీనామాలు తిరస్కరించడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సర్కారుకు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కొంత సమయం దొరికినట్లయ్యింది. రెబల్స్‌‌లో కనీసం సగమందిని దారిలోకి తెచ్చుకున్నా సంక్షోభం నుంచి తాత్కాలికంగా గట్టెక్కడం ఖాయం.

ఒకవైపు రెబల్స్‌‌ను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, మరోవైపు వరుసగా ఎమ్మెల్యేలు జారిపోతూనే ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రెబల్స్‌‌తో జత కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సీఎల్పీ భేటీకి రెబల్‌ ఎమ్మెల్యేలందరూ గైర్హాజరయ్యారు. తామంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాజీనామా చేశామని, తమకు మంత్రి పదవులు అవసరం లేదని రెబల్స్‌‌ తెగేసి చెబుతున్నారు. అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్యపై క్లారిటీ రావడం లేదు. కొందరు 13 అంటుంటే, మరికొందరు 15మంది అంటున్నారు.

Full View  

Tags:    

Similar News